ఎస్సెమ్మెస్ కొట్టు.. బస్సు పట్టు

6 Feb, 2014 04:19 IST|Sakshi
ఎస్సెమ్మెస్ కొట్టు.. బస్సు పట్టు
  •    సెల్ ద్వారా బస్సుల రాకపోకల సమాచారం
  •      త్వరలోనే సిటీలో అందుబాటులోకి
  •  సాక్షి,సిటీబ్యూరో : రమేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. హైటెక్ సిటీకి వెళ్లేందుకు ఉదయం 9కి వనస్థలిపురం బస్టాప్‌కు చేరుకున్నాడు. బస్సు కోసం ముప్పావు గంటకు పైగా పడిగాపులు కాయాల్సి వచ్చింది. విలువైన సమయం బస్సు కోసం నిరీక్షించేందుకే వెచ్చించాల్సి వచ్చింది. కానీ తాను ఇంటి నుంచి  బయలుదేరడానికి  ముందే వనస్థలిపురం నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు ఏ సమయానికి బస్సు ఉందో తెలుసుకోగలిగితే ఆ  విలువైన సమయాన్ని మరో పని కోసం వినియోగించుకొనే అవకాశం ఉండేది.

    సరిగ్గా  ఇలాంటి సిటీ బస్సు  సమాచార సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ  శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు  తమ సమీపంలోని  బస్‌షెల్టర్  కోడ్‌ను, తాము  వెళ్లవలసిన రూట్ నెంబర్‌ను ఎస్సెమ్మెస్  ద్వారా ఆర్టీసీకి చేరవేస్తే  చాలు.  క్షణాల్లో  ఆ  రూట్‌లో  వెళ్లే  బస్సులు,ఆ  బస్‌షెల్టర్‌కు  ఏ సమయానికి  చేరుకుంటాయో  సంక్షిప్త సందేశం  రూపంలో  ప్రయాణికుల  ఫోన్‌కు  వచ్చేస్తుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో  ప్రయాణికులు బస్టాపుల్లో పడిగాపులు కాయకుండా  ఆఫీసు నుంచి, ఇంటి నుంచి  తాము బయలుదేరే సమయానికి  అందుబాటులో ఉన్న బస్సుల  వివరాలను ముందే తెలుసుకొని బయటకు రావచ్చు.  

    మరో  నెల రోజుల్లో  ఈ  సదుపాయం అందుబాటులోకి వచ్చే  అవకాశం ఉంది. నగరంలోని  వందకు పైగా ప్రధాన బస్‌షెల్టర్లలో  మొదట ప్రయోగాత్మకంగా  దీన్ని  అందుబాటులోకి  తేనున్నారు. ఇందుకోసం ఆ  షెల్టర్లన్నింటికీ ప్రత్యేక కోడ్ నెంబర్లను కేటాయిస్తారు. ప్రయాణికులు  ఎస్సెమ్మెస్ చేసేందుకు ఒక  టోల్‌ఫ్రీ నెంబర్‌ను  ప్రవేశపెడతారు. ప్రస్తుతం  రైళ్ల సమాచారాన్ని తెలుసుకొనేందుకు  అందుబాటులో  ఉన్న విధానం  తరహాలోనే సిటీ  బస్సుల  సమాచారం  తెలుసుకొనేందుకు  అవకాశం కలుగుతుంది.

    పొరుగున ఉన్న మైసూర్‌లో  500  సిటీ బస్సులకు  ఈ సదుపాయం ఉంది. నగరంలో తొలుత 1000  బస్సుల్లో దీన్ని  ప్రవేశపెడతారు. దశల వారీగా అన్నింటికీ విస్తరిస్తారు. మరో  నెల రోజుల్లో  ఈ సదుపాయం  ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చే  అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో  చెప్పారు. వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (వీటీపీఐ) పరిజ్ఞానం ఆధారంగా దీన్ని అమలు చేస్తారు.
     
    మరో మూడు రూట్లకు వెహికిల్ ట్రాకింగ్ విస్తరణ...
     
    ప్రస్తుతం నగరంలోని  రెండు  రూట్లలో  అమలు జరుగుతున్న  వెహికిల్ ట్రాకింగ్  వ్యవస్థను  మరో 3  రూట్లకు  విస్తరించనున్నారు. కోఠీ-లింగంపల్లి (222), వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ-కొండాపూర్ (127కె) రూట్లో ప్రయోగాత్మకంగా వెహికల్ ట్రాకింగ్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ట్రయల్న్‌గ్రా  46 బస్సుల్లో  దీన్ని  ప్రవేశపెట్టారు. ఆ  రెండు రూట్లలో  బస్సుల  రాకపోకల వివరాలు  బస్సుల్లోని ఎల్‌ఈడీ  బోర్డుల్లో  ప్రదర్శించడంతో పాటు, ఎంపిక చేసిన బస్‌షెల్టర్లలో కూడా  ప్రదర్శిస్తారు. ఈ సదుపాయాన్ని త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. ఉప్పల్-కొండాపూర్ (113కె), సికింద్రాబాద్-హెటెక్‌సిటీ (10హెచ్),ఉప్పల్-మెహదీపట్నం (113ఎం) రూట్లలో  వెహికల్ ట్రాకింగ్‌ను  విస్తరించనున్నారు.
     

మరిన్ని వార్తలు