నిరుద్యోగులకు వరం ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’

2 Sep, 2015 08:50 IST|Sakshi
నిరుద్యోగులకు వరం ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’

గాజులరామారం(హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగ ప్రకటన చేయగా, త్వరలో అన్ని కేటగిరీల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. అయితే యువత ఆలోచనలకు అనుగుణంగా దరఖాస్తు సులభతరం చేయడానికి, ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన సమాచారం నేరుగా అభ్యర్థులకు చేరవేయడానికి ప్రభుత్వం ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఉద్యోగ ప్రకటనలతో సంబంధం లేకుండా అభ్యర్థి పేరును సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే ప్రకటన వివరాలు నేరుగా తెలియజేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఇచ్చిన సమాచారం మేరకు మన అర్హతలకు తగిన ఉద్యోగ సమాచారం మన ఫోన్‌కు సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) రూపంలో వస్తుంది. మరి పేరు నమోదుకు ఎం చేయాలి, ఏయే పత్రాలు కావాలి తదితర అంశాలు మీకోసం..

తొలుత http://tspsc.gov.in/TSPSCOTR2015/oneTimeRegistration.tspsc లింక్‌లో లాగిన్ అవ్వాలి.
ఇక్కడ వన్ టైమ్ రిజిష్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది.
అందులో ఆధార్ నంబరు, ఆధార్‌లో ఉన్న పేరును ఎంటర్ చేయాలి.

వ్యక్తిగత వివరాలు..
* ఇక్కడ మీ పేరు, చిరునామా, పుట్టిన ఊరు, మండలం, గుర్తింపు వివరాలు, ప్రస్తుత చిరునామా, ఫోన్ నంబరు పొందుపరచాలి.
* ఇతరత్రా సందేశాలకు ఈ-మెయిల్ చిరునామా, మినహాయింపు పొందగోరితే ఆ వివరాలు నమోదు చేయాలి.

విద్యార్హతలు..
* విద్యాభ్యాసం ప్రారంభం నాటి నుంచి చివరి వరకు అన్ని వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 
* ఇక్కడ మాత్రం ప్రతి తరగతి చదివిన స్కూల్, కాలేజీ పేరు, ప్రదేశంతో పాటు ఉత్తీర్ణత సంవత్సరం, హాల్‌టికెట్ నంబరు, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, పొందిన గ్రేడ్ నమోదు చేయాలి. 
* ఒకటో తరగతి నుంచి ఎంఫిల్ వరకు విద్యార్హతలు నమోదు చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది.
* ఇతర ప్రత్యేక విద్యార్హతలు ఉంటే ‘యాడ్ క్వాలిఫికేషన్’ ఆప్షన్‌ను ఎంచుకొని వివరాలు నమోదు చేయవచ్చు.

ఫొటో అప్‌లోడ్..
* 50 కేబీ పరిమాణంలో 3.5x4.5 సెం.మీ. పరిమాణంతో కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
* అదేవిధంగా 30 కేబీ పరిమాణంలో 3.5x1.5 సెంమీ వైశాల్యంతో వ్యక్తిగత సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
* అప్‌లోడ్ చేసే ముందు ఫొటో దిగిన తేదీని తెలపాలి.

అలర్ట్ ఆఫ్షన్..
* ఆఖరుగా ‘నోటిఫికేషన్ అలర్ట్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఒక అభ్యర్థి కేవలం ‘గ్రూప్స్’కు సంబంధించిన ప్రకటనలు మాత్రమే కావాలనుకుంటే ‘గ్రూప్’ ఆప్షన్‌ను, అన్ని రకాల ఉద్యోగ ప్రకటనలు కావాలనుకుంటే ‘ఎనీ జాబ్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
* అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ణయించుకున్నాక ‘సెల్ఫ్ డిక్లరేషన్’ను క్లిక్ చేసి సబ్‌మిట్ చేయాలి. 
* ఇప్పుడు మీ మొబైల్‌కు పది అంకెల పాస్‌వర్డ్, టీఎస్‌పీఎస్సీ ఐడీ నంబరు సంక్షిప్త సమాచారం వస్తుంది.

డెరైక్ట్ రిక్రూట్‌మెంట్..
* ఇప్పుడు మీకు వచ్చిన పాస్‌వర్డ్, ఐడీలతో నేరుగా సంబంధిత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 
* మళ్లీ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. వెబ్ హోమ్ పేజీలో ‘డెరైక్ట్ రిక్రూట్‌మెంట్’ ఆప్షన్‌లోకి వెళ్లి సబ్‌మిట్ అప్లికేషన్ క్లిక్ చేయాలి.

* ఇక్కడ మీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి.. సూచనలను అనుసరించి నిర్ధేశిత రుసుమును చెల్లిస్తే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయినట్లే.

సూచన: రిజిస్ట్రేషన్ సమయంలో ఏయే వివరాలు నమోదు చేశారో అవి మీ అసలు ధ్రువపత్రాలతో సరిపోవాలి.

మరిన్ని వార్తలు