అదుపు తప్పిన ఉల్లి ధరలు

23 Aug, 2015 05:33 IST|Sakshi
అదుపు తప్పిన ఉల్లి ధరలు

 హోల్‌సేల్ మార్కెట్లలో భారీగా పెరిగిన ధరలు
 రిటైల్ మార్కెట్‌లో రూ.100కు చేరే అవకాశం

 
 సాక్షి, హైదరాబాద్ : ఉల్లిధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు అనూహ్యంగా పెరగడం రిటైల్ మార్కెట్లపై పెనుభారం మోపుతోంది. శుక్ర, శనివారాల్లో ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో కిలో ఉల్లి రేటు రూ.100కు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉల్లి మార్కెటింగ్‌లో కీలకమైన మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్‌లో శుక్రవారం నాటి ధరలతో పోల్చి చూస్తే ఒక్క రోజే కిలో ధర రూ.8-10 వరకు పెరిగింది. తక్కువ నాణ్యతగల కర్నూలు రకం కిలో ఉల్లి శుక్రవారం గరిష్టంగా రూ.40 పలకగా, శనివారం రూ.52కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో గ్రేడ్ వన్ రకం రూ.80 పలుకుతోంది. దేశంలో ఉల్లి మార్కెటింగ్‌లో అత్యంత కీలకమైన లసల్‌గావ్ (మహారాష్ట్ర) వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం కిలో రూ.55 పలకగా, శనివారం 57కు చేరుకుంది.

దేశం మొత్తానికి లసల్‌గావ్ కీలకం కావడంతో అంతటా ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తోంది. లసల్‌గావ్ మార్కెట్‌కు ఉల్లి రాక గణనీయంగా తగ్గింది. గత జూలై 21న 1,021 టన్నులు రాగా, శుక్రవారం కేవలం 240 టన్నులు మాత్రమే మార్కెట్‌కు రావడం గమనార్హం. ధరల నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్, చైనా, ఈజిప్ట్, అఫ్ఘానిస్తాన్ తదితర దేశాల నుంచి దిగుమతులకు అనుమతించింది. విదేశాలకు ఎగుమతి అయ్యే ఉల్లి టన్ను ధరను 425 డాలర్ల నుంచి 700 డాలర్లకు పెంచింది.

రాష్ట్రంపై తీవ్ర ప్రభావం: మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్‌కు రోజుకు సగటున పది వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతి అవుతుండగా, తాజాగా ఐదు వేల క్వింటాళ్లకు పడిపోయింది. ఇందులో 20 శాతం మహారాష్ట్ర నుంచి వస్తుండగా, మిగతాది కర్నూలు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వస్తోంది. దీంతో రాష్ట్రంలోనూ ధరలు ఆకాశాన్నంటే సూచనలు కనిపిస్తున్నాయి. కిలోకు రూ.20 చొప్పున సబ్సిడీపై సరఫరా చేసేందుకు మార్కెటింగ్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా 88 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు రూ.5.88 కోట్లు వెచ్చించి 1,479.42 టన్నుల ఉల్లిని సేకరించింది. ధరలు అనూహ్యంగా పెరుగుతుండటంతో సబ్సిడీపై ఇవ్వడం మార్కెటింగ్ శాఖకు సవాలుగా మారింది. శనివారం హోల్‌సేల్‌లో ఉల్లి ధర రూ.68 పలకడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విదేశాల నుంచి భారీ మొత్తంలో దిగుమతి చేసుకోవడం, ఖరీఫ్ ఉత్పత్తి మార్కెట్లోకి రావడం మినహా ధరలు అదుపు చేసేందుకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు.
 
 ఉల్లి ఎగుమతి ధర భారీగా పెంపు
 న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్‌లో చుక్కలన్నింటిన ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కనీస ఎగుమతి ధర(ఎమ్‌ఈపీ)ను భారీ పెంచింది. టన్ను ధరపై దాదాపు రూ.18,203(275 డాలర్లు) పెంచి విదేశాలకు ఉల్లి ఎగుమతులను తగ్గించడానికి చర్యలు చేపట్టింది. దీంతో ఇంత వరకూ టన్నుకు దాదాపు రూ.28,132(425 డాలర్లు)గా ఎమ్‌ఈపీ రూ. 46,335(700 డాలర్లు)కు చేరింది. ఫలితంగా ఎగుమతులు తగ్గి ఉల్లి దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందని, దరలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తుంది. అలాగే మరో పదివేల టన్నులు ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలోని లాసల్‌గాన్ ఉల్లి మార్కెట్‌లో తాజాగా హోల్‌సేల్‌లోనే కిలో ఉల్లి ధర రూ.57కి చేరింది.

మరిన్ని వార్తలు