భవనాలు, లే ఔట్లకు ఆన్‌లైన్ అనుమతులు

8 Jun, 2016 04:04 IST|Sakshi
భవనాలు, లే ఔట్లకు ఆన్‌లైన్ అనుమతులు

- 10 నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో అమలు
48 గంటల్లోపు తనిఖీ నివేదిక..30 రోజుల్లో అనుమతులు
 
 సాక్షి, హైదరాబాద్: భవనాలు, లే ఔట్ల నిర్మాణ అనుమతుల కోసం ఇకపై మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. 30 రోజుల్లో అనుమతులు అందనున్నాయి. భవనాలు, లే ఔట్లకు ఆన్‌లైన్ అనుమతుల కోసం ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల్లో అమలు చేస్తున్న ‘డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (డీపీఎంఎస్)’ను ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని మిగతా 73 పురపాలికల్లోనూ అమల్లోకి తీసుకువస్తున్నారు. దీంతో దరఖాస్తు దశ నుంచి అనుమతి జారీ వరకు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగనుంది. అనుమతి కోసం కావాల్సిన అన్ని పత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో దరఖాస్తుతోపాటు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

 శరవేగంగా ప్రక్రియ
 దరఖాస్తు చేశాక 24 గంటల్లో స్థానిక పురపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారు. తనిఖీ నివేదికను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. 48 గం టల తర్వాత దరఖాస్తుదారులు ఆ తనిఖీ నివేదికను డౌన్‌లోడ్ చేసుకుని అందులోని వివరాలను తెలుసుకోవచ్చు. ఇక లే ఔట్లు, భవనాల అనుమతి కోసం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకోగానే టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పిన ఫీజును దరఖాస్తుదారులు చెల్లిస్తున్నారు. ఇకపై అనుమతుల కోసం ము న్సిపాలిటీలకు చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఆన్‌లైన్ ద్వారా తెలిసిపోతుంది. ఇక ప్రక్రియ మొత్తం పూర్తికాగానే అనుమతి జారీ చేసినట్లు స్థానిక మున్సిపల్ కమిషనర్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. అధికారుల డిజిటల్ సంతకాలతో అనుమతి పత్రం సాఫ్ట్‌కాపీ రూపంలో దరఖాస్తుదారు ఈ-మెయిల్‌కు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో దరఖాస్తు చేసుకునేవారు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరమే ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.

 డ్యాష్ బోర్డులతో అవినీతికి తెర
 భవనాలు, లే ఔట్లకు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి 30 రోజుల గడువు విధించారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం మున్సిపాలిటీలు తీసుకుంటున్న చర్యలను నిరంతరం సమీక్షించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి, డెరైక్టరేట్‌తో పాటు డీటీసీపీ కార్యాలయాల్లో డ్యాష్ బోర్డు తెరలను ఏర్పాటు చేస్తారు. దరఖాస్తుల పరిష్కారం స్థితిగతులకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం డ్యాష్ బోర్డులపై కనిపిస్తుంది. దీంతో ఎక్కడెక్కడ జాప్యం జరుగుతుందో ఉన్నతాధికారులకు తెలిసిపోతుంది. అందువల్ల కింది స్థాయి అధికారులు గడువులోగా దరఖాస్తులను పరిష్కరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని... అనుమతుల జారీలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
 
 ప్రపంచ బ్యాంకు ర్యాంకుపై గురి
 పెట్టుబడులు, వ్యాపారానికి అనుకూల పరిస్థితుల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పరంగా గతేడాది ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి 13వ ర్యాంకు కేటాయించగా... ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం 2వ ర్యాంకు ఇచ్చింది. తెలంగాణలో భవనాలు, లే ఔట్లకు ఆన్‌లైన్ అనుమతుల విధానం అమల్లో లేకపోవడమే ర్యాంకు తగ్గడానికి కారణం. ఏపీలోని 110 మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్ అనుమతుల విధానాన్ని అమలు చేస్తుండడంతో ర్యాంకింగ్‌లో కలసి వచ్చింది. ఇక ఈ ఏడాదికి సంబంధించిన ర్యాంకులను త్వరలో ప్రపంచ బ్యాంకు వెల్లడించబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టి ర్యాంకు మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు