ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే ఇలా ఉంది

18 Dec, 2015 09:27 IST|Sakshi
ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే ఇలా ఉంది

ప్రధానమైన అంశం ఉన్నప్పుడు ఎవరైనా, చర్చ జరిగిన తర్వాత ప్రకటన ఇస్తారు గానీ, ప్రకటన తర్వాత చర్చ అనేది తాను ఎక్కడా వినలేదని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే జరుగుతోందని చెప్పారు. ''సీఎం ప్రకటన చేసేసిన తర్వాత ఇక చర్చించడానికి ఏముంది? కామన్ సెన్స్ ఉండాలి. చర్చ జరిగిన తర్వాత ప్రకటన ఉండాలి. అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, ఐదురోజులే ఎందుకు పెట్టారు, అది కూడా మధ్యాహ్నం వరకే ఎందుకు? మరో రెండు రోజులు పొడిగించి, ఆ రెండు రోజులు అచ్చంగా అంబేద్కర్ గారి మీదే చర్చిద్దాం. చంద్రబాబు, ఆయన కొడుకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సెక్స్ రాకెట్‌లో ఉన్నారు. డీజీ ఇంటెలిజెన్స్ ఈ మాదిరిగా నిందితులతో కూర్చుంటున్నారు. ఇంత ముఖ్యమైన టాపిక్ మీద చర్చ జరగకుండా చూసుకోడానికి అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు'' అని ఆయన అన్నారు.

ఈ మధ్యలో మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఏం అంశంపై అయినా ప్రకటన చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని చెప్పారు. చర్చ పెట్టాలని అడిగే హక్కు ప్రతిపక్షానికి లేదని అన్నారు. కావాలని అసెంబ్లీని స్తంభింపజేయాలని అనుకుంటున్నారన్నారు. చర్చే కావాలంటే ప్రభుత్వం ఆమోదించే సమస్య లేదని, ముందు ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత మాత్రమే చర్చకు అనుమతిస్తామని తెలిపారు. ఇలాగే సభను అడ్డుకుంటే తగిన చర్య తీసుకోవాల్సిందిగా చెబుతానని బెదిరించారు.

రాష్ట్రం మొత్తమ్మీద చాలా పరిణామాలు జరిగాయని, ఏయే అంశాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుందో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చ ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

ఈ గందరగోళం నడుమ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు