తెరుచుకున్న ‘పాలమూరు’ టెండర్లు

12 Mar, 2016 05:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన అనంతరం అత్యంత భారీ వ్యయంతో చేపడుతున్న ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ఆర్థిక టెండర్లు(ప్రైస్ బిడ్)ను అధికారులు శుక్ర వారం రాత్రి తెరిచారు. మొత్తం 18 ప్యాకేజీలకు గానూ రూ.29,924.78 కోట్ల పనులను నవయుగ, కేఎన్‌ఆర్, మెగా, హెచ్‌ఈఎస్, సుశీ ఇన్‌ఫ్రా వంటి ప్రధాన కాంట్రాక్టు సంస్థలు దక్కించుకున్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 62 మండలాలకు చెందిన 1,131 గ్రామాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశ్యంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులకు జనవరి 17న నీటి పారుదల శాఖ టెండర్లను పిలిచింది. వీటికి చెందిన టెక్నికల్ బిడ్‌లను ఫిబ్రవరి 20నే తెరిచారు. అయితే సాంకేతిక అర్హత పరిశీలనలో జాప్యం కారణంగా ఫిబ్రవరి 29న తెరవాల్సిన ప్రైస్ బిడ్‌లను శుక్రవారం రాత్రి తెరిచారు.

 పెద్ద ప్యాకేజీలన్నీ బడా సంస్థలకే..
 ప్రాజెక్టులో పెద్ద ప్యాకేజీల పనులను దక్కించుకునేందుకు పటేల్, మెగా, నవయుగ, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు పోటీలో నిలిచాయి. అయితే పటేల్, ఎల్‌అండ్‌టీ, గాయత్రి వంటి సంస్థలు సాంకేతిక అర్హత సాధించలేదని నీటిపారుదల వర్గాల ద్వారా తెలిసింది. దీంతో మెజార్టీ ప్యాకేజీల్లో పోటీ లేకుండానే ఆయా సంస్థలు పనులు దక్కించుకున్నాయి. ప్యాకేజీ 10, ప్యాకేజీ 15లో మినహా అన్ని చోట్ల తక్కువ విలువకే టెండర్లు దాఖలయ్యాయి. సూపరింటెండెంట్ స్థాయి అధికారులు టెండర్లను తెరిచి, పరిశీలన కోసం చీఫ్ ఇంజనీర్‌కు పంపించారు. సీఈ స్థాయిలో పరిశీలన పూర్తయిన అనంతరం కమిషనర్ ఆఫ్ టెండర్స్ పరిశీలనకు పంపనున్నారు. అక్కడ టెండర్లు పొందిన సంస్థల అర్హతలను పరిశీలించిన తర్వాత పనులు అప్పగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు