‘తమ్మిడిహెట్టి’పై ఒత్తిళ్లకు తలొగ్గిన కేసీఆర్

17 Apr, 2016 01:41 IST|Sakshi

* విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల వేదిక ఆరోపణ
* 152 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టు నిర్మించాలి

సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రధాన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరిట మేడిగడ్డకు మార్చడంలో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ఒత్తిళ్లకు తలొగ్గారని విపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిటైర్డు జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ జల సాధన సమితి నేత నైనాల గోవర్దన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.

తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించలేకపోయిందని చంద్రకుమార్ విమర్శించారు. వ్యాప్కోస్ నివేదిక మేరకే గతంలో తమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందనే అంచనాతో ప్రధాన ప్రాజెక్టును ప్రతిపాదించారన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలిక్  సంస్థ నుంచి నివేదిక తీసుకోకుండా మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి తమ్మిడిహెట్టి నుంచి కాల్వలు తవ్వారని.. ప్రాజెక్టు స్థలం మార్పుతో ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ఇంజనీర్లపై ఒత్తిడి తెచ్చి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నారని చంద్రకుమార్ ఆరోపించారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించేలా మహారాష్ట్ర, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని తీసుకె ళ్లాలని డిమాండ్ చేశారు.
 
ప్రాజెక్టు డిజైన్ మార్పు ఎందుకు?
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా రీ డిజైనింగ్ పేరిట ప్రభుత్వం ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మారుస్తోందని నైనాల గోవర్దన్ ప్రశ్నించారు. కమీషన్ల కోసం రీ డిజైనింగ్ పేరిట ప్రభుత్వ పెద్దలు నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆరోపించారు. రీ డిజైనింగ్ వల్ల తెలంగాణలో 40 వేల ఎకరాలు ముంపునకు గురవుతుందన్నారు.

గతంలో తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి.. నీళ్లు లేవనే సాకుతో మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్ముకు సీఎం కేసీఆర్ కేవలం కస్టోడియన్ మాత్రమేనని.. ప్రజా ధనాన్ని వృథా చేయడాన్ని ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపే అవకాశం వున్నా.. అబద్దాల పునాదులపై ప్రాజెక్టులను నిర్మించే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పరిధి నుంచి రంగారెడ్డి జిల్లా ఆయకట్టును తొలగించి.. పాలమూరు ఎత్తిపోతల పథకంలో చేర్చడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చాడ ఆరోపించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ ఎంల్ న్యూ డెమొక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్‌రామయ్య, ఆప్ నాయకులు శ్రీశైలం. రాం నర్సయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా