మరణిస్తూ.. ప్రాణం పోశాడు..

20 Oct, 2016 02:15 IST|Sakshi
వంశీకృష్ణ కాలేయాన్ని తరలిస్తున్న దృశ్యం

విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో 29 ఏళ్ల యువకుడి బ్రెయిన్‌డెడ్
అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు
హైదరాబాద్‌కు విమానంలో గుండె... అంబులెన్స్ లో కాలేయం తరలింపు

సాక్షి, హైదరాబాద్: తను కన్నుమూస్తూ.. కొందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ యువకుడు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన గంగుల వంశీకృష్ణ(29) ఓ ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. అతనికి ఇటీవల తీవ్రమైన తలనొప్పి, జ్వరం వచ్చింది. చికిత్స కోసం మూడు రోజుల క్రితం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమించి మెదడులో రక్తం గడ్డకట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.

చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యులు బ్రెరుున్‌డెడ్‌గా ప్రకటించారు. వంశీకృష్ణ అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో వెంటనే జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. వైద్య బృందం వెంటనే ఆస్పత్రికి చేరుకుని దాత నుంచి గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, రెండు కళ్లు సేకరించారు. ఇలా సేకరించిన అవయవాల్లో గుండెను జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితునికి అమర్చగా, కాలేయాన్ని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి, కిడ్నీలను మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ, విజయవాడ ఆయుష్ ఆస్పత్రులకు, కళ్లు వాసన్ ఐ కేర్‌కు తరలించారు. తమ బిడ్డ భౌతికంగా తమ ముందు లేకున్నా మరో ఆరుగురిలో సజీవంగా ఉన్నాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. 

 యశోదలో కాలేయ మార్పిడి...
లూథియానాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా, కాలేయం మార్చాలని సూచించారు. వంశీకృష్ణ వివరాలు వీరికి కూడా అందడంతో విజయవాడ చేరుకుని దాత నుంచి కాలేయాన్ని సేకరించి అంబులెన్‌‌స(ప్రత్యేక గ్రీన్‌ఛానల్)లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. సుమారు పది మందితో కూడిన వైద్య బృందం పది గంటల పాటు శ్రమించి బాధితునికి దాత కాలేయాన్ని అమర్చింది. 

అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి
విశాఖకు చెందిన చెందిన 25 ఏళ్ల యువకుడు కొంత కాలంగా తీవ్రమైన ఆయాసం, ఛాతిలో నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. మంగళవారం అపోలో ఆస్పత్రిని ఆశ్రరుుంచగా.. కార్డియోమయోపతి అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండెమార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఇదే రోజు సాయంత్రం వంశీకృష్ణ అవయవదాన వివరాలు అందాయి. బాధితుడు చికిత్సకు అంగీకరించడంతో డాక్టర్ ఏజీకే గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం మంగళవారం అర్ధరాత్రి విజయవాడకు వెళ్లి దాత నుంచి గుండెను సేకరించింది. బుధవారం ఉదయం గన్నవరం ఎరుుర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంది. ఆస్పత్రికి చేరుకున్నాక ఎనిమిది గంటల పాటు శ్రమించి బాధితునికి దాత గుండెను విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం బాధితుని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గోఖలే స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు