రాజధానిలో.. దంగల్

28 Jul, 2017 01:14 IST|Sakshi
రాజధానిలో.. దంగల్
మన మల్లయోధులకు హరియాణా నిపుణుల శిక్షణ
- ఆ రాష్ట్ర యువతకు కబడ్డీలో తెలంగాణ శిక్షణ
ఘుమర్, లంబాడా నృత్యాల్లో పరస్పర తర్ఫీదు
ఇరు రాష్ట్రాల సంయుక్త ‘పురావస్తు’ తవ్వకాలు
‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ్‌ భారత్‌’ పథకంలో భాగం
 
సాక్షి, హైదరాబాద్‌: దంగల్‌ (కుస్తీ). హరియాణా మల్లయోధుడు మహవీర్‌సింగ్‌ ఫొగట్‌ జీవిత కథ ఆధారంగా రూపొంది రికార్డులు నెలకొల్పిన హిందీ సినిమా. ఇప్పుడీ క్రీడ హరియాణా, తెలంగాణ మధ్య వారధి కాబోతోంది. మల్లయోధుల శిక్షణకు హరియాణా మారుపేరు కాగా, కుస్తీకి హైదరాబాద్‌లోనూ అనాదిగా ప్రత్యేక స్థానముంది. ఈ నేపథ్యంలో మన వర్ధమాన రెజ్లర్లకు హరియాణా నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం నగరంలో ప్రత్యేక అఖాడా (రెజ్లింగ్‌ శిక్షణ కేంద్రం)లు ఏర్పాటు కాబోతున్నాయి. రాష్ట్రాల మధ్య బంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం రూపొందించిన ఏక్‌ భారత్, శ్రేష్ఠ్‌ భారత్‌ పథకంలో భాగంగా ఈ కార్యక్రమంరూపుదిద్దుకుంది.

హైదరాబాద్‌లోని మెరుగైన అఖాడాలను, ప్రతిభావంతులైన యువతను ఎంపిక చేసేందుకు ముగ్గురు కోచ్‌లతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. వారికి హరియాణా నిపుణులు త్వరలో శిక్షణ మొదలు పెడతారు. అలాగే కబడ్డీ, ఖోఖోల్లో హరియాణా క్రీడాకారులకు తెలంగాణ నిపుణులు తర్ఫీదునిస్తారు. ఈ క్రీడల్లో రెండు రాష్ట్రాల మధ్య పోటీలు కూడా నిర్వహిస్తారని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ దినకర్‌బాబు తెలిపారు. ఇది రాష్ట్రాల మధ్య బంధాన్ని పెంచటంతో పాటు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిపెట్టగలదని ఆశాభావం వెలిబుచ్చారు. 
 
ఏక్‌ భారత్, శ్రేష్ఠ్‌ భారత్‌ పథకం అమలులో తెలంగాణ–హరియాణా జోడీ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. పథకం అమలులో పురోగతిని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆయా విభాగాల అధికారులు గురువారం సచివాలయంలో మీడియాకు వివరించారు.
 
వారి ఘుమర్‌..మన లంబాడా నృత్యాలు..
సాంస్కృతిక అనుబంధాన్ని పెంచుకోవడంలో భాగంగా హరియాణా కళాకారులు ఇటీవల నగరానికి వచ్చి 15 మంది యువతులకు అక్కడి ప్రసిద్ధ ఘుమర్‌ నృత్యాన్ని నేర్పారు. తెలంగాణ సంప్రదాయ లంబాడా నృత్యాన్ని స్థానిక కళాకారుల నుంచి నేర్చుకున్నారు. ఇటీవల హరియాణాలో తీజ్‌ పండుగ సందర్భంగా అక్కడి రాజ్‌భవన్‌లో తెలంగాణ కళాకారులు ఘుమర్, హరియాణా కళాకారులు లంబాడా నృత్యాలతో స్థానికులను అలరించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రదినోత్సవం నాడు రవీంద్రభారతిలో హరియాణా కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వెంకటేశం తెలిపారు. త్వరలో హరియాణాలో తెలంగాణ సంబురాలు, హైదరాబాద్‌లో హరియాణా దివస్‌ నిర్వహిస్తామని వెల్లడించారు.

హరప్పా నాగరికత విలసిల్లిన ప్రాంతాల్లో ఒకటైన హరియాణాలోని కునాల్‌లో పురావస్తు తవ్వకాల్లో తెలంగాణ సిబ్బంది పాలుపంచుకోనున్నారు. తెలంగాణలో శాతవాహనుల జాడలున్న కర్ణమామిడి, బౌద్ధజాడలున్న పెద్దబంకూరుల్లో తవ్వకాల్లో హరియాణా నిపుణులు పాల్గొంటారని పురావస్తు సంచాలకురాలు విశాలాచ్చి తెలిపారు. 100 తెలుగు పదాలు, తెలుగు వాక్యాలు, 100 తెలుగు జాతీయాలు, ప్రముఖ తెలుగు కవుల మూడు రచనలను హిందీలోకి అనువదించి హరియాణాకు అందజేస్తారు. అలాగే వారి పుస్తకాలనూ తెలుగులోకి అనువదిస్తారని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. 
మరిన్ని వార్తలు