హైదరాబాద్ వెలుపల తొలి రైల్వే లిఫ్టు

8 Aug, 2016 01:58 IST|Sakshi
హైదరాబాద్ వెలుపల తొలి రైల్వే లిఫ్టు

* నిజామాబాద్ స్టేషన్‌లో నేడు ప్రారంభం
* సికింద్రాబాద్ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించనున్న రైల్వే మంత్రి ప్రభు
* హైదరాబాద్-గుల్బర్గా, కాజీపేట - ముంబై రైళ్లకూ ప్రారంభోత్సవం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు భాగ్యనగరం వెలుపల మొదటిసారి రైల్వే లిఫ్టు సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు లిఫ్టులను రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు సోమవారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలోనే లిఫ్టులు ఉన్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయిన సురేశ్ ప్రభు...తెలంగాణలోని రైల్వే స్టేషన్‌లలో లిఫ్టుల ఏర్పాటులో నిర్లక్ష్యమెందుకు సాగుతోందో అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 17 రైల్వేస్టేషన్‌లలో 36 లిఫ్టులు ఉంటే ఇందులో తెలంగాణలో కేవలం మూడు స్టేషన్‌లలోనే ఏర్పాటయ్యాయి. మిగతా ప్రధాన స్టేషన్లలోనూ వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించారు. మరోవైపు సికింద్రాబాద్-గుల్బర్గా మధ్య కొత్త ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, కాజీపేట-ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కూడా సురేశ్ ప్రభు సోమవారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రిమోట్ ద్వారా ప్రారంభించనున్నారు.

ఆ రైళ్లు గుల్బర్గా, ముంబైల నుంచి అదే సమయానికి బయలుదేరతాయి. గత యూపీఏ ప్రభుత్వం 2014 రైల్వే బడ్జెట్‌లో వీటిని ప్రకటించినా ఇప్పటివరకు అవి పట్టాలెక్కలేదు. ఆదివారం ప్రధానితో కలసి హైదరాబాద్‌కు వచ్చిన సురేశ్ ప్రభు, సోమవారం దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు రాత్రి ఇక్కడే బస చేశారు. ఈ సందర్భంగా కొత్త రైళ్లను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించటంతో వారు యూపీఏ ప్రకటించిన రైళ్లను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.

సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆధునీకరించిన విశ్రాంతి గదులను, కాజీపేట, హైదరాబాద్ స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైటింగ్ వ్యవస్థను, నాగులపల్లి-ఢిల్లీలోని తుగ్లకాబాద్ మధ్య వారానికోసారి నడిచే టైంటేబుల్డ్ కార్గో ఎక్స్‌ప్రెస్ సర్వీసునూ సురేశ్ ప్రభు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాలకు ముందు రైల్ క ళారంగ్‌లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్నారు.
 
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎంతో భేటీ
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి ఢిల్లీకి తిరిగి పయనమయ్యాక సీఎం కేసీఆర్‌తో సురేశ్ ప్రభు సమావేశమయ్యారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు బేగంపేటలోని ఆయన నివాసానికి విందుకు వెళ్లిన సురేశ్ ప్రభు...రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎంతో చర్చించారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని సీఎం ఈ సందర్భంగా కోరారు. అలాగే హైదరాబాద్‌లోని రైల్వే స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని... ఆ స్థలాలు తమకు అప్పగిస్తే ప్రత్యామ్నాయంగా పట్టణ శివార్లలో స్థలాలు ఇస్తామని ప్రతిపాదించారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్న గత యూపీఏ ప్రభుత్వ హామీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వట్టినాగులపల్లి. మౌలాలీల్లో కొత్త రైల్వే టెర్మినళ్లు నిర్మించాలని విన్నవించారు. దీనిపై సురేశ్‌ప్రభు స్పందిస్తూ ఈ విషయాల్లో సమన్వయంతో ముందుకు వెళదామన్నారు. రాష్ట్రం విజ్ఞప్తులపై ప్రతినెలా సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే జీఎం రవీంద్రగుప్తాకు సూచించారు.

>
మరిన్ని వార్తలు