చినుకు చిటికేస్తే.. సిటీ వణుకుడే

19 Jul, 2017 07:02 IST|Sakshi
చినుకు చిటికేస్తే.. సిటీ వణుకుడే
మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం
- సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
513 అడుగులకు ‘సాగర్‌’ నీటిమట్టం
రాష్ట్రవ్యాప్తంగా పొంగుతున్న వాగులు, వంకలు
మధిరలో అత్యధికంగా 9.4 సెంటీమీటర్లు
ఉధృతంగా మూసీ, పెరుగుతున్న గోదావరి నీటిమట్టం 
 
సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నెట్‌వర్క్‌: రాజధాని హైదరాబాద్‌ను వర్షం విడవడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా 3 రోజులుగా వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రానికి నగరంలో సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని  సుమారు 200కు పైగా బస్తీలను వర్షపునీరు ముంచెత్తింది. ప్రధాన రహదారులపై 234 బాటిల్‌నెక్స్‌ వద్ద భారీగా నీరు నిలవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

ఉద్యోగులు, విద్యార్థులు 4 గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. వర్షం విడవకుండా కురుస్తుం డటం తో నగరంలోని పురాతన భవనాల్లో నివసిస్తున్న వారు తక్షణం ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. గతేడాది గ్రేటర్‌ పరిధిలో 2,010 శిథిల భవనాలను గుర్తిం చగా.. ఇప్పటివరకు 1,451 భవనాలను కూల్చి వేశామని.. మిగిలిన 559 భవనాల్లో నివసిస్తున్నవారు తక్షణం ఖాళీచేయాలని నోటీసులి చ్చామని అధికా రులు తెలిపారు. కాగా, నగర శివార్లలోని పర్వతా పూర్‌లో మూసీలోకి వరద ప్రవాహం పోటెత్తడంతో వరద నీరు రహదారిపై నిలిచి వాహనాల రాకపోక లకు అంతరాయం కలిగింది. గ్రేటర్‌ జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ల ఎగువ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుం డడంతో జలాశయాల్లోకి వరద ప్రవాహం మొదల వలేదని జలమండలి వర్గాలు తెలిపాయి.   
 
పెరిగిన ‘సాగర్‌’ నీటి మట్టం
► హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం 513.41 మీ. కాగా మంగళవారం 513.32 మీ.కు చేరుకుంది 
► హుస్సేన్‌సాగర్‌లోకి 1,625 క్యూసెక్ల ఇన్‌ఫ్లో వస్తుం డగా 600క్యూసెక్‌లను దిగువకు విడుదల చేస్తున్నారు
 
మధిరలో 9.4 సెం.మీ. వర్షం
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యా ప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం మధిరలో అత్యధికంగా 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  జోగుళాంబ గద్వా ల జిల్లాలో 10.2, ఖమ్మం జిల్లాలో 5.1 సెం.మీ, రంగారెడ్డి జిల్లాలో 3.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగా రెడ్డి జిల్లాలో జంట జలాశయాలైన గండిపేటలో 1,576.88, హిమాయత్‌సాగర్‌లో 1,745.34 అడు గుల నీటి మట్టం పెరిగింది. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలంలో అత్యధికంగా 1.4 సెంటీ మీటర్లు, నిజామాబాద్‌ జిల్లాలో  2 సెంటీ మీటర్లకు పైగా సగటు వర్షపాతం నమోదైంది.

అత్యధికంగా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో 3.9 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 1.4  సెం.మీ., జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 1.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. రూరల్‌ జిల్లాలోని నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారు చిన్నమాటుకు గండిపడింది. ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో వేమనపల్‌ మండలంలో అత్యధికంగా 1.7 సెం.మీ., మంచిర్యాల, మంద మర్రి, నస్పూర్‌ మండలాల్లో అత్యల్పంగా 0.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
 
మహబూబ్‌నగర్, వనపర్తిలో వర్షాలు
ఖమ్మం జిల్లాలోని 1,407 చెరువులు, కుంటల్లో.. 550 చెరువుల్లోకి 25 శాతం నీరు చేరింది. పాలేరు రిజర్వా యర్‌లోకి అడుగు మేర వరద నీరు చేరింది. లంకాసాగర్‌ ప్రాజెక్టు 8.6 అడుగులకు నీరు చేరింది. తల్లాడ మండలంలోని ముద్దునూరి పడమటి చెరువు  గండిపడింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని తిమ్మా జిపేట, తాడూరు, వెల్దండ, వంగూరు, తెలక్కపల్లి, అచ్చంపేట, అమ్రాబాద్‌ మండలాలల్లో సాధారణ వర్షపాతాని కంటే రెట్టింపు నమోదైంది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 2 రోజుల నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం బాలానగర్‌లో 1.5, కోస్గిలో 1.3, మిడ్జిల్‌ 1.3, గండీడ్‌ 1.1, నవాబ్‌పేటలో 1.1, దేవరకద్రలో 0.8 సెం.మీ. వర్షం కురిసింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో అత్యధికంగా 1.3 సెం.మీ, అత్యల్పంగా పెద్దమందడిలో 0.7, జోగుళాంబ గద్వా ల జిల్లాలో 10.2 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గద్వాలలో 1.7, అత్య ల్పంగా ఐజలో 0.1 సెం.మీ. వర్షం కురిసింది. 
 
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 17 అడుగులకు చేరింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు, పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని దిగువకు వదులుతుండటంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రా జెక్ట్‌కు వరద పోటెత్తింది. మంగళవారం ఉదయం నుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో 15 గేట్లను ఎత్తి 85 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
 
సింగూరుకు జలకళ
సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. నారాయణఖేడ్, జహీరాబాద్, కోహిర్‌ నుంచి వరద వస్తుండటంతో మంగళవారం నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 523.6 మీటర్లు కాగా ప్రస్తుతం 521 మీటర్లకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 29.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.28 టీఎంసీల నీరుంది.
 
ఉధృతంగా మూసీ.. 
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్టులోకి వర దనీరు వస్తోంది. కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు సామర్థ్యం 645 అడు గులు కాగా ప్రస్తుతం 629.5 అడుగుల మేర నీరుంది. మునగాల మండలంలో  7.2 సెం. మీ. నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిలాయిపల్లి నుంచి బీబీనగర్, వలిగొండ మండలాల్లో మూసీ ఉధృతంగా పారుతోంది. 
మరిన్ని వార్తలు