బాకీ డబ్బులివ్వలేదని దారుణం

10 Oct, 2013 05:19 IST|Sakshi
బాకీ డబ్బులివ్వలేదని దారుణం

=     మారుణాయుధాలతో దాడి
=     అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం
 =    అబిడ్స్‌లో ఘటన

అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: అప్పుగా తీసుకున్న డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా అప్పు ఇచ్చిన వ్యక్తిని హతమార్చాలని చూస్తున్న మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మారణాయుధాలతో దాడి చేసి సదరు వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. ఈఘటనలో పోలీసులు నిందితులను 24 గంటల్లోపు అరెస్ట్‌చేసి కటకటాల్లోకి తరలించారు.

ఈ దారుణం అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఏసీపీ జైపాల్, సీఐ గురురాఘవేంద్రలతో కలిసి మీడియాకు వివరించారు. ఎంజేమార్కెట్ శంకర్‌బాగ్‌కు చెందిన ఉదయ్‌ఆనంద్(32)కు నేరచరిత్ర ఉంది. 15 ఏళ్లక్రితం అబిడ్స్ రామకృష్ణ థియేటర్‌లో సినిమా టికెట్లను బ్లాక్‌లో విక్రయించేవాడు. తర్వాత పండ్లవ్యాపారం చేసి కాస్త డబ్బుకూడ బెట్టి ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించాడు.

ఇలా స్థానికంగా ఉంటున్న తోపుడుబండ్లు, ఇతర  వ్యాపారులకు 5శాతం వడ్డీకి డబ్బులిచ్చేవాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన రమేష్‌రాజు (45) నగరానికి వలసొచ్చి ఎస్సార్‌నగర్ కళ్యాణ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. బ్లాక్‌టికెట్లు విక్రయించిన రమేష్‌రాజుకు అప్పట్లోనే ఉదయ్‌ఆనంద్‌తో పరిచయమైంది. అయితే రమేష్‌రాజు తన అవసరం నిమిత్తం ఉదయ్‌ఆనంద్ వద్ద రూ.6లక్షలు 5శాతం వడ్డీకి అప్పు తీసుకున్నాడు.

తీసుకున్న దానికి ప్రతినెలా రూ.30వేలు వడ్డీ చెల్లించేందుకు బాండ్‌పేపర్‌పై లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత బాండ్‌పేపర్ కనిపించకపోవడంతో ఉదయ్‌ఆనంద్ మరో బాండ్‌పేపర్ రాయాలని రమేష్‌రాజును అడిగాడు. ఇక అప్పటినుంచి వడ్డీ డబ్బులు కట్టడం మానేశాడు. ఇది ఇద్దరి మధ్య పలుమార్లు ఘర్షణకు దారితీసింది.
 
ఒకరినొకరు చంపుకునే యత్నం: ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతుండడంతో ఒకరినొకరు చంపుకునేందుకు పథకం పన్నారు. రమేష్‌రాజు తనను చంపేందుకు యత్నిస్తున్నాడని ఇతరుల ద్వారా తెలుసుకున్న ఉదయ్‌ఆనంద్ తనపై దాడికి రాకముందే రమేష్‌రాజును మట్టుబెట్టాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా పాతనేరస్తుడైన సయ్యద్‌సలీం, గౌలిగూడకు చెందిన డి.విజయ్, బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్‌అహ్మద్‌లను సంప్రదించాడు.

మంగళవారం సాయంత్రం అప్పు కావాలని వచ్చిన రమేష్‌రాజును ప్లాన్‌ప్రకారం బిగ్‌బజార్ సమీపంలోని ఫైనాన్స్ కార్యాలయానికి రమ్మన్నాడు. అక్కడ్నుంచి టీ తాగుదామని హోటల్‌కు తీసుకెళ్లిన ఉదయ్‌ఆనంద్ అప్పటికే మాటువేసిన తన అనుచరుల సాయంతో కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. సమాచారమందుకున్న అబిడ్స్ పోలీసులు రక్తపుమడుగులో పడివున్న రమేష్‌రాజును ఆస్పత్రికి  తరలించగా అప్పటికే మృతిచెందాడు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న అబిడ్స్ పోలీసులకు మృతుని వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు డాగర్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. 24గంటల్లో నిందితులను అరెస్ట్‌చేసిన ఏసీపీ జైపాల్,  సీఐ గురురాఘవేంద్ర, ఎస్‌ఐలు శ్రవణ్‌కుమార్, నాయుడు ఇతర సిబ్బందికి త్వరలో రివార్డులను అందించనున్నట్లు డీసీపీ వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు