ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించనున్న పీఏసీ

29 Jul, 2015 18:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డలోని మానసిక రోగుల ఆసుపత్రిని ఆగస్టు 5వ తేదీన సందర్శించాలని ప్రభుత్వ పద్దుల కమిటీ (పిఎసి) నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాలులో పిఎసి చైర్మన్ పి.కిష్టారెడ్డి అధ్యక్ష్యతన బుధ వారం సమావేశం జరిగింది. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఖైదీల కోసం నిర్మిస్తున్న ప్రత్యేక వార్డు పనులు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న ఈ వార్డు పనులు 2006లో మొదలయ్యాయి. తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంపై అధికారులను వివరాలు కోరింది.

సరిపడా నిధులు లేని కారణంగానే వార్డు నిర్మాణం పూర్తి కాలేదని అధికారులు ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల నిధులు విడుదల చేసిన విషయాన్ని అధికారులకు పిఎసి గుర్తు చేసింది. అధికారులు చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితికి ఎక్కడా పొంతన కుదరడం లేదని కమిటీ గుర్తించింది. దీంతో వచ్చే నెల 5వ తేదీన ఎర్రగ డ్డ ఆసుపత్రిని సంద ర్శించాలని, ఖైదీల ప్రత్యేక వార్డును పనులను పరిశీలించాలని పిఎసి నిర్ణయించింది.

మరిన్ని వార్తలు