ది బెస్ట్ ఠాణా పంజగుట్ట..

4 Jan, 2018 09:29 IST|Sakshi

నగర పోలీస్‌ స్టేషన్‌కు అరుదైన గుర్తింపు

జాతీయ స్థాయిలో ‘బెస్టాఫ్‌ త్రీ’కి ఎంపిక

గ్వాలియర్‌లో అవార్డు ఇవ్వనున్న ఎంహెచ్‌ఏ

రాష్ట్ర పోలీసు విభాగానికి అందిన ఆహ్వానం

పంజగుట్ట ఠాణాకు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోనే ‘బెస్టాఫ్‌ త్రీ’లో ఒకటిగా ఈ పోలీస్‌ స్టేషన్‌ను కేంద్రం అధీనంలోని హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రారంభంకానున్న డీజీపీలు, ఐజీపీల 52వ వార్షిక సదస్సులో పంజగుట్ట పోలీసులకు అవార్డు అందజేస్తారు. మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని దేశంలోనే ఉత్తమంగా నిలిచే పది ఠాణాలను గుర్తించి...వాటిలో మూడింటిని బెస్టాఫ్‌ త్రీగా ఎంపిక చేస్తారు. దేశంలోని 140 పోలీస్‌ స్టేషన్లు దీనికోసం పోటీపడగా.. పంజగుట్ట ఠాణాకు ఈ గౌరవం దక్కడం విశేషం.

సాక్షి, హైదరాబాద్‌: లైంగిక ఆరోపణ కేసులో ప్రముఖ గజల్‌ గాయకుడు కేసిరాజు శ్రీనివాస్‌ను అరెస్టు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో పంజగుట్ట ఠాణా పేరు మారుమోగింది. ఈ మోడల్‌ పోలీసుస్టేషన్‌ పేరు మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగానూ వినిపించనుంది. కేంద్రం ఆధీనంలోని హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఈ పోలీసుస్టేషన్‌ను దేశంలోనే ‘బెస్టాఫ్‌ త్రీ’ల్లో ఒకటిగా ఎంపిక చేయడమే దీనికి కారణం. శనివారం నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రారంభంకానున్న 52వ వార్షిక డీజీపీలు, ఐజీపీల సదస్సులో కేంద్రం పంజగుట్ట పోలీసులకు అవార్డు అందించనుంది. 51వ డీజీపీల సదస్సు 2016లో హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీసు అకాడమీలో జరిగింది. అప్పుడు ‘ఉత్తమ పోలీసుస్టేషన్ల’ గుర్తింపును తీర్మానంగా చేశారు. మౌళిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ దేశంలోనే ఉత్తమంగా నిలిచే పది ఠాణాలను గుర్తించాలని, వాటిలో మూడింటిని బెస్టాఫ్‌ త్రీగా ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని ఆ సదస్సులో నిర్ణయించారు. 2017 డిసెంబర్‌లో జరగాల్సిన 52వ వార్షిక సదస్సు ఈ నెలకు వాయిదా పడింది. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లోని టెక్కెన్‌పూర్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్‌ అకాడెమీలో శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. 

నెలన్నర అధ్యయనం తర్వాత ఎంపిక...
దేశ వ్యాప్తంగా పది ఉత్తమ పోలీసుస్టేషన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యతల్ని ఎంహెచ్‌ఏ క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియాకు అప్పగించింది. కేంద్రం ఆధీనంలోని ఈ విభాగం 2017లో దేశంలోన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంట్రీలను ఆహ్వానించింది. మొత్తమ్మీద 140 పోలీసుస్టేషన్లు పోటీపడగా... అత్యధికంగా మహారాష్ట్రలోని పుణే కమిషనరేట్‌ నుంచి 16 ఎంట్రీలు వచ్చాయి. ఏపీ నుంచి రెండు పోలీసుస్టేషన్లు, తెలంగాణ నుంచి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, పంజగుట్ట ఠాణాలకు సంబంధించిన ఎంట్రీలు వెళ్ళాయి. 140 ఎంట్రీలను పరిగణలోకి తీసుకున్న ఈ విభాగం కొన్నింటిని షార్ట్‌లిస్ట్‌ చేసింది. వాటిలో జూబ్లీహిల్స్, పంజగుట్ట కూడా ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం గతేడాది హైదరాబాద్‌ చేరుకుని దాదాపు నెలన్నర పాటు రహస్యంగా ఈ రెండు ఠాణాల పనితీరు, వాటిలోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఒక్కో పోలీసుస్టేషన్‌ పరిధి నుంచి 100 మందిని ఎంపిక చేసుకుని వారి అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో ఠాణాకు వచ్చిన బాధితులు, దాని చుట్టుపక్కల నివసించే వారు, పోలీసుస్టేషన్‌ పరిధిలోని విద్య, వ్యాపార సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి వివరాలు సేకరించింది. 

అత్యంత క్లిష్టమైన ఎంపిక విధానం...
క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా ఎంపిక విధానం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. తొలుత అభిప్రాయాలు సేకరించినప్పుడు కనీసం 80 శాతం మంది పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి చెందిన బృందం ఆ ఠాణాకు సంబంధించి ఇతర అంశాలను పరిశీలిస్తుంది. ఆకస్మికంగా ఆ పోలీసుస్టేషన్‌ను సందర్శించే బృంద సభ్యులు మౌలిక వసతులు, వాటి నాణ్యతా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, నేరగాళ్ళకు శిక్షలు పడుతున్న శాతం, రికవరీలతో పాటు ఠాణా పరిశుభ్రత, పచ్చదనంతో అక్కడి పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణ తీరు, ఫైళ్ళ నిర్వహణలను పరిగణనలోకి తీసుకుంటారు.

‘టాప్‌ 1’ తెలిసేది ఆ రోజే...
ప్రత్యేక ప్రామాణికాల ఆధారంగా పదింటి నుంచి తొలుత ‘బెస్టాఫ్‌ త్రీ’గా దేశంలోనే ఉత్తమమైన మూడు పోలీసుస్టేషన్లను ఎంపిక చేస్తారు. ఈ జాబితాను ఓ నిపుణుల కమిటీకి హెచ్‌ఎంఏ అందిస్తుంది. వీరు చేసే మదింపు తర్వాత ఉత్తమ పోలీసుస్టేషన్‌ను ఎంపిక చేసి, దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాన్ని రోల్‌మోడల్‌గా ప్రకటిస్తారు. 2017కు సంబంధించి పంజగుట్ట పోలీసుస్టేషన్‌ ‘బెస్టాఫ్‌ త్రీ’లో స్థానం సంపాదించింది. ఈ మేరకు ఎంహెచ్‌ఏ నుంచి రాష్ట్ర పోలీసు విభాగానికి వర్తమానం అందింది. గ్వాలియర్‌లో జరిగే సదస్సు నేపథ్యంలో శనివారమే మిగిలిన రెండు ఠాణాలు ఏంటి? ఈ మూడింటిలో మొదటి స్థానంలో నిలిచింది ఏది? అనే అంశాలు వెల్లడికానున్నాయి.   

మరిన్ని వార్తలు