స్తంభించిన ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలు

6 Sep, 2015 02:13 IST|Sakshi

 ఆరు నెలలుగా నిలిచిన ప్రచారం

 సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టీసాక్స్)లో కార్యక్రమాలు స్తంభించాయి. ఎయిడ్స్‌పై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాల్సి ఉండగా ఆరు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో ఎయిడ్స్ రోగులకు అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. ఎయిడ్స్‌పై దృష్టిపెట్టాల్సిన ఆ సంస్థ నిర్లక్ష్యం నీడలో ఉందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు అందులో పనిచేసే 800 మంది ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్వచ్ఛంద సంస్థలకు నిధులు ఇవ్వకపోవడంతో వాటి పనితీరూ మందగించింది. రెగ్యులర్ ప్రాజెక్టు డెరైక్టర్ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలున్నాయి. ఇన్‌చార్జి పీడీకి కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలుండటంతో ఎయిడ్స్ నియంత్రణపై దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి.

 ఏపీ ఖజానాలో నిధుల జమ
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీసాక్స్)ను పదో షెడ్యూల్‌లో చేర్చడంతో ప్రస్తుతం ఏపీ సాక్స్‌పై ఉన్న ఖాతా టీసాక్స్ పేరిట బదలాయించారు. అదే సమయంలో ఏపీలో కొత్తగా మరో సాక్స్‌ను ఇంకా నెలకొల్పకపోవడంతో నిధుల వినియోగంపై సమస్యలు మొదలయ్యాయి. కేంద్రం నుంచి రూ. 26.86 కోట్ల నిధులు మొదటి విడతగా విడుదలైనా వాటిని ఏపీ ఖజానాలో జమ చేయడంతో చిక్కు వచ్చిపడింది. టీసాక్స్‌లోకి రూపాయి కూడా కేంద్రం నుంచి అందలేదు. దీంతో అనేక కార్యక్రమాలు మూలన పడ్డాయి. గత నాలుగైదు నెలలుగా హెచ్‌ఐవీ, సీడీ4 వంటి నిర్ధారణ పరీక్ష కిట్ల సరఫరా నిలిచిపోయినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు