అధిక ధరలకు ఎరువులమ్మితే లైసెన్సు రద్దు

13 Feb, 2018 03:31 IST|Sakshi

కలెక్టర్లకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఎరువులను అధిక ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్లకు లేఖ రాశారు. ఎరువుల కొరతేమీలేదని పేర్కొన్నారు. ఎరువులను గరిష్ట చిల్లర ధర(ఎంఆర్‌పీ) కంటే ఎక్కువ ధరకు ఎక్కడైనా విక్రయించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

డీఏపీ సహా ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కంపెనీలు పెంచిన నేపథ్యంలో పాతస్టాక్‌ను పాత ధరల్లోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత ఎరువులను విక్రయించిన తర్వాతే కొత్తవాటిని రైతులకు విక్రయించాలని పేర్కొన్నారు. ఈ మేరకు విక్రయాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే పెరిగిన ధరలు అమలులోకి వచ్చినందున పీవోఎస్‌ యంత్రాల ద్వారా విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఎరువుల డీలర్లు పాత, కొత్త స్టాకు ధరలను దుకాణాల ముందు రైతులకు కనిపించేలా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఎరువుల దుకాణాలను పర్యవేక్షించేలా మండల వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీచేయాలన్నారు. దుకాణాల రికార్డు బుక్కుల్లో పాత, కొత్త స్టాకు వివరాలు సరిగా ఉన్నాయో... లేవో పరిశీలించాలని సూచించారు.

మరిన్ని వార్తలు