ప్రపంచ వాణిజ్య సంస్థకు శ్రీకర్‌రెడ్డి బదిలీ

18 Jul, 2014 00:56 IST|Sakshi
ప్రపంచ వాణిజ్య సంస్థకు శ్రీకర్‌రెడ్డి బదిలీ

* ఆయన హయాంలోనే భారీగా పాస్‌పోర్ట్ సంస్కరణలు
* 24 గంటల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్ ఇచ్చిన ఘనత కూడా

 
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ కె.శ్రీకర్‌రెడ్డి జెనీవాలోని ప్రపంచ వాణి జ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు బదిలీ అయ్యారు. ఇకపై డబ్ల్యూటీఓలో భారత దేశానికి సంబంధించి జరిగే వాణిజ్య కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
 
నల్గొండ జిల్లా మోత్కూర్ మండలం కొండగడపకు చెందిన శ్రీకర్‌రెడ్డి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2001లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై ఢిల్లీలోని విదేశాంగశాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేశారు. 2011లో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా నియమితులయ్యారు. అప్పటికే అస్తవ్యస్థంగా ఉన్న పాస్‌పోర్ట్‌ల జారీపై ఆయన దృష్టి సారించి తీవ్ర సంస్కరణలు చేపట్టారు.
 
వేళ్లూనుకునిపోయిన దళారీ వ్యవస్థను పూర్తిగా తొలగించగలిగారు. ఆయన వచ్చేనాటికి పెండింగ్‌లో ఉన్న లక్ష పాస్‌పోర్ట్‌లను దశల వారీగా జారీ చేయగలిగారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతోపాటు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోనే పాస్‌పోర్ట్‌ల జారీలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని అగ్రస్థానంలో నిలిపారు.
 
ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించడంలోనూ కీలక పాత్ర పోషించారు. తత్కాల్ పాస్‌పోర్ట్‌ను 24 గంటల్లోనే జారీ చేయగలిగారు. పాస్‌పోర్ట్‌ల జారీలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన శ్రీకర్‌రెడ్డి ప్రపంచ అత్యున్నత సంస్థ అయిన డబ్ల్యూటీఓకు బదిలీ అయ్యారు.  ఆయన నెలాఖరున రిలీవ్ కావచ్చని సమాచారం.
 
కొత్త పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని

హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని సత్తారు నియమితులయ్యారు. ఈమె 2007 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి ఉమాపతి కూతురే అశ్విని. ఆమె గత కొన్ని నెలలుగా హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేస్తున్నారు. డాక్టర్ శ్రీకర్‌రెడ్డి బదిలీ కావడంతో ఆమెను ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా నియమిస్తూ విదేశీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది.
 
అశ్విని హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి తొలి మహిళా పాస్‌పోర్ట్ అధికారి కావడం విశేషం. ప్రాథమిక విద్య నుంచి ఇంజనీరింగ్ వరకూ అశ్విని హైదరాబాద్‌లోనే చదివారు. ఆమె రెండేళ్లపాటు పాస్‌పోర్ట్ అధికారిగా కొనసాగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో పాస్‌పోర్ట్ కార్యాలయం, కొత్తగా మినీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటు తదితర వాటిలో ఈమె కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు