ప్రీమియమూ చెల్లించాలి బిల్లులూ కట్టాలి

26 Jun, 2015 01:58 IST|Sakshi
ప్రీమియమూ చెల్లించాలి బిల్లులూ కట్టాలి

బిల్లుల కోసం 22 వేల మంది ఎదురు చూపులు
ప్రహసనంగా నగదు రహిత వైద్యం
ప్రీమియం చెల్లిస్తున్నా వైద్యానికి తప్పని నగదు చెల్లింపు
జబ్బు నయమయ్యాక ఎనిమిది నెలలకుగానీ డబ్బు రాని పరిస్థితి
ఉద్యోగులు, పెన్షనర్ల వెతలు..

 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు జబ్బు చేస్తే ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్లి రూపాయి కూడా చెల్లించకుండా వైద్యం చేయించుకోవచ్చునని రాష్ట్రప్రభుత్వం చెబుతుండగా..

పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకోసం కల్పించిన ‘నగదు రహిత వైద్యం’ ఏమాత్రం సక్రమంగా అమలవట్లేదు. ఒకవైపు ప్రీమియం చెల్లిస్తూనే మరోవైపు ఆస్పత్రుల్లో చేతినుంచి డబ్బులు చెల్లించే పరిస్థితి ఉద్యోగులు, పెన్షనర్లకు ఏర్పడుతోంది. గడిచిన ఐదున్నర నెలల్లో.. అంటే 2015 జనవరి 1 నుంచి ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో వైద్యంకోసం వెళ్లి చేతి నుంచి డబ్బులు చెల్లించిన వారి సంఖ్య 22 వేలకు పైనే. వీరంతా మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోరుతూ వైద్యవిద్యా సంచాలకుల(డీఎంఈ) కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు.

ఇంతస్థాయిలో దరఖాస్తులు వచ్చాయంటే నగదు రహిత వైద్యం ఎంత ప్రహసనంగా సాగుతున్నదో అర్థమవుతోంది. ఉద్యోగుల స్థాయినిబట్టి కొందరు నెలకు రూ.90, మరికొందరు రూ.120 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా ప్రీమియం చెల్లిస్తూనే మరోవైపు ఆస్పత్రుల్లో చేతినుంచి డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితిపై ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.
 
జబ్బు నయమయ్యాక ఎనిమిది నెలలకు డబ్బు..
ఉద్యోగికి జబ్బు చేస్తే జేబులో పైసా లేకుండా ఆస్పత్రికి భరోసాగా వెళ్లొచ్చునని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ జబ్బు నయమైన ఎనిమిది నెలలకుగానీ ఆ డబ్బు రావట్లేదని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఖర్చు రూ.50 వేలు దాటితే జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఆ బిల్లును హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపించాలి. అక్కడనుంచి డీఎంఈ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ అనుమతి పొంది తిరిగి పేరెంట్ విభాగానికి రావాలి. అక్కడనుంచి జిల్లాకు రావాలి.. ఇదీ తంతు.అలా ఐదారునెలల్లో రావచ్చు. లేదా ఏడాదికీ రావట్లేదు. పైగా వైద్య సేవలకైన ఖర్చు మొత్తం రీయింబర్స్‌మెంట్ కింద రాదు. ఒక్కోసారి రూ.3 లక్షలైతే.. రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి లేదు.
 
ప్యాకేజీ సెటిల్‌మెంట్ ఏదీ?..
ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు సుమారు 35 లక్షలమందికి సంబంధించిన అంశమిది. దీనిపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుండడంపై వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్యాకేజీ రేట్లు గిట్టుబాటు కాదని ప్రైవేటు ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లకే చేయాలని ప్రభుత్వం.. ఇలా ఇరువర్గాలు పట్టుదలకు వెళుతుండడంతో పథకం వెనక్కు వెళ్లింది. యాజమాన్యాలను పిలిచామని, నగదురహిత పథకం ఇదిగో.. ఇప్పుడు.. రేపూ.. అంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఏమీ చేయలేకపోయింది.

దీంతో ఓవైపు ప్రీమియం చెల్లిస్తూ, మరోవైపు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లిస్తూ, ఈ డబ్బు రీయింబర్స్‌మెంట్ ఎంతొస్తుందో తెలియక ఉద్యోగులంతా అయోమయంలో ఉన్నారు. ఇక పెన్షనర్ల బాధ చెప్పనలవి కాదు. ఇదిలావుంటే.. డీఎంఈ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులకు కమీషన్లు ఇస్తేగానీ అక్కడి సిబ్బంది అనుమతివ్వని పరిస్థితి. ఇదీ నగదు రహిత వైద్యం దుస్థితి.

మరిన్ని వార్తలు