‘పుర’ పోరు పట్టించుకోవద్దు

23 Feb, 2016 02:48 IST|Sakshi
‘పుర’ పోరు పట్టించుకోవద్దు

పీసీసీ నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: వరుసగా వస్తున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి రాష్ట్ర స్థాయిలో సమగ్ర వ్యూహం, పార్టీ నిర్దిష్ట కార్యక్రమాలకు దిశానిర్దేశం లేకుండా చేస్తున్నాయని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పీసీసీని నడిపించాల్సి ఉందని, ఎప్పటికప్పుడు వస్తున్న ఇలాంటి ఎన్నికలతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. ప్రతి పక్షంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ఈ సమయంలో టీఆర్‌ఎస్‌పై రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయడానికి చాలా అంశాలున్నాయని, వాటి నుంచి దృష్టిని మళ్లించే మరే ఇతర విషయాలను పట్టించుకోకుండా ఉండటమే మంచిదనే నిర్ణయానికి పీసీసీ వచ్చింది.

ఖమ్మం, వరంగల్ నగర పాలక సంస్థల ఎన్నికల బాధ్యతలను ఆయా జిల్లాల ముఖ్యులకే అప్పగించాలని నిర్ణయించింది. స్థానిక ఎన్నికల్లో పార్టీ టికెట్లు, ప్రచార వ్యూహం, ఇతర ముఖ్యమైన అంశాల కోసం పరిశీలకులను ఖరారు చేసింది. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో పరిశీలకులుగా ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ల ను, వరంగల్ కోసం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డిని నియమించారు.

అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్యే డీకే అరుణతోపాటు జిల్లా పార్టీ నేతలకు అప్పగించారు. స్థానిక ఎన్నికల ఫలితాల్లో గెలుపోటముల నుంచి పార్టీ దృష్టిని మళ్లించే విధంగా కార్యక్రమాలకు పీసీసీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. మధ్యమధ్యలో వచ్చే ఎన్నికలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించకుండా ఎక్కడికక్కడ కార్యాచరణను నిర్దేశించాలని పీసీసీ సమన్వయ కమిటీ నిర్ణయించింది. ‘తమిళనాడులో ఏఐడీఎంకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. అయినా ఆ తరువాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీ అభ్యర్థులను, శ్రేణులను కాపాడుకోవడానికి పోటీచేయాల్సి వస్తోంది’ అని టీపీసీసీ ముఖ్యుడు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు