సరైన వాదనలు లేకనే పెండింగ్‌ కేసులు

20 Aug, 2017 04:06 IST|Sakshi
సరైన వాదనలు లేకనే పెండింగ్‌ కేసులు

అపరిష్కృత కేసులతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం: హరీశ్‌
ప్రాజెక్టుల నిర్మాణంలో న్యాయపర చిక్కులు త్వరగా అధిగమించాలని సూచన


సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కేసుల్లో సమర్థవంతమైన వాదనలు లేకపోవడంతోనే ఈ కేసులు కోర్టుల్లో సుదీర్ఘకాలం కొనసాగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏళ్లతరబడి ఈ కేసులు అపరిష్కృతంగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోందని.. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్నారు. శనివారం జలసౌధలో ప్రభుత్వ న్యాయవాదులు, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులను త్వరగా అధిగమించాలని కోరారు.

జిల్లాల్లోని వివిధ కోర్టు కేసుల్లో ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదించేందుకు హైదారాబాద్, ఢిల్లీ నుంచి సీనియర్‌ న్యాయవాదులను నియమించుకోవాలని సూచించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించడానికి సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. దేవాదుల, ఏ.ఎం.ఆర్‌.పి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల్లో పలు చోట్ల పది, ఇరవై ఎకరాల భూసేకరణ సమస్యలు కోర్టు కేసుల్లో చిక్కుకున్న కారణంగా వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతున్నట్టు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్‌ మానేరు ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్లు కాగా పరిహారం చెల్లింపుల కోసం ఏకంగా రూ.1,400 కోట్లు ఖర్చు చేయవలసి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, లా కార్యదర్శి నిరంజన్‌ రావు, ఈఎన్సీ మురళీధర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు