జూన్‌ 2 నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్లు

4 May, 2017 00:44 IST|Sakshi
జూన్‌ 2 నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్లు

- ప్రణాళికను నిర్దేశించిన సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌
- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు మార్గదర్శకాలు


సాక్షి, హైదరాబాద్‌: ఒంటరి మహిళల పెన్షన్ల ను జూన్‌ 2 నుంచి పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్లు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ ఆదేశించారు. ఒంటరి మహిళల పెన్షన్ల  మార్గదర్శకాలు జారీ చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించా లన్నారు.  బుధవారం సచివాలయం నుంచి సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌ అన్ని జిల్లాల  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  బి.ఆర్‌. మీనా, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్‌డీ ప్రియంకా వర్గీస్, పంచాయతీరాజ్‌ కమిష నర్‌ నీతూ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ పెన్షన్‌ మంజూరు చేయాలని సీఎస్‌ అన్నారు.

ఈ నెల 8 నుంచి 13 వరకు గ్రామ సభల్లో,   మున్సిపల్‌ వార్డులలో మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీక రణను ప్రారంభించాలని సీఎస్‌ ఆదేశించారు. 9 నుంచి 18 వరకు దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి, 19 నుంచి 21 వరకు దరఖాస్తుదారుల జాబితాలను గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌  వార్డు లలో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించా లన్నారు. 22న లబ్ధిదారుల జాబితాను ప్రకటించి ప్రదర్శించాలన్నారు. 23 నుండి 25 వరకు డేటాను అప్‌లోడ్‌ చేయాలన్నారు. కలెక్టర్లు శ్రద్ధ వహించి ఈ పథకం అమలుపై జిల్లా యంత్రాంగానికి తగు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలోను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పెన్షన్ల పంపిణీ జరగాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో అర్హుల ఎంపికకు ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలన్నారు. ఈ పథకానికి సంబంధించి సెర్ప్‌ కార్యాలయం లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తా మన్నారు. రాష్ట్రంలో వచ్చే సీజన్‌లో హరిత హారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వ హించడానికి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్‌ కలెక్టర్లను ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు