రెండున్నరేళ్లలో ఏం చేశారు?

18 Jan, 2017 07:24 IST|Sakshi
రెండున్నరేళ్లలో ఏం చేశారు?

అసెంబ్లీలో బీజేఎల్పీ నేత జి. కిషన్ రెడ్డి  
విశ్వనగరం ఏమో కానీ.. విషాదనగరం చేయకండి
గాలిలో మేడలు కడుతూ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామంటున్నారు
రూ. 21 వేల కోట్లు ఖర్చు చేసి ఏం అభివృద్ధి చేశారో చెప్పండి
జీహెచ్‌ఎంసీని ముందు ప్రక్షాళన చేయండి..

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని బీజేపీ శాసన సభాపక్ష నేత జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రూ. 21 వేల కోట్లను ఖర్చు పెట్టి మహానగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెపుతోం దని, అవన్నీ ప్రణాళికల స్థాయిలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందడం ఏమో కానీ.. విషాదనగరంగా మాత్రం మార్చవద్దని వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీలో గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధిపై జరిగిన లఘుచర్చలో ఆయన పాల్గొన్నారు. ‘హైదరాబాద్‌ అంటే హైటెక్‌ సిటీ ఒక్కటే కాదు. హైదరాబాద్‌ అంటే మలక్‌పేట, హైదరాబాద్‌ అంటే పాతబస్తీ, హైదరాబాద్‌ అంటే అంబర్‌పేట. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసినప్పుడే మహానగరం విశ్వనగరం అవుతుంది. అలాంటి అభివృద్ధిలో మేం కూడా భాగస్వాములమవుతాం.

కేంద్రాన్ని కూడా ఒప్పించి సహాయ పడతాం’అని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో అవినీతి పేరుకుపోయిందని, ఉద్యోగుల ప్రక్షాళన అత్యవసరమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశ్వనగరంగా మార్చడమ నేది దీర్ఘకాలిక పని అని, ఈ లక్ష్యాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే, తక్షణావసరాల కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గాలొస్తే కరెంటు కోతలు, వానొస్తే ట్రాఫిక్‌ సమస్యలు.. ఇలా నగర జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయిందని, కనీసం రోడ్లు మరమ్మతులు కూడా లేక జనాలు నానా అవస్థలు పడుతున్నారని చెపుతూ ఇటీవల మల్కాజ్‌గిరిలో జరిగిన ఓ ఘటనను కూడా ఉదహరించారు. ‘నేను మల్కాజ్‌గిరి వెళుతున్నప్పుడు ఓ కొత్త జంట ద్విచక్రవాహనంపై వెళ్తోంది. మా వాహనం ముందు వెళుతున్న వారు మాకు సైడ్‌ కూడా ఇవ్వలేదు. ఎంత హారన్  కొట్టినా స్పందించలేదు.

దానికి తోడు బండి నడుపుతున్న వ్యక్తి తన భార్యను పదేపదే తడుముతున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక కొద్ది దూరం వెళ్లాక సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న ఆ జంటను నేను ప్రశ్నించా. కొత్తగా పెళ్లయితే ఇంటి దగ్గర సరసాలాడుకోవాలి కానీ రోడ్లమీదెందుకుని మందలించే ప్రయత్నం చేశా. అప్పుడా వ్యక్తి సమాధానమిస్తూ తానేమీ తన భార్యతో సరసం ఆడటం లేదని, కొత్తగా గ్రామం నుంచి వచ్చిన నా భార్య సిటీ రోడ్డు గుంతల్లో ఎగరేసినప్పుడు ఉందో, కిందపడిపోయిందా చూసుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు నగర వాస్తవ పరిస్థితి.. నగరవాసి మనోవేదన నాకు అర్థమయ్యాయి’అని కిషన్ రెడ్డి చెప్పారు.

మూసీ మురికి నల్లగొండకా?: కోమటిరెడ్డి
హైదరాబాద్‌ నగరంలోని మూసీ నది నీటిని ట్రీట్‌మెంట్‌ చేసి ఆ మురికి నీటిని నల్లగొండ జిల్లా ప్రజల జీవితాల్లోకి పంపుతున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నీరు పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి మీదుగా సూర్యాపేట వరకు దాదాపు 150 కిలోమీటర్లు వెళ్తోందని ఆయన చెప్పారు. ఎన్ కన్వెన్షన్ లో ఆక్రమణ జరిగిందని, జీహెచ్‌ఎంసీ అధికారులే మార్కింగ్‌ చేసినా ఇంతవరకు దానిని కూల్చలేదని, కానీ, పేదలు, తెలంగాణ ప్రజలు కట్టుకున్న భండారీ లేఅవుట్‌ను ఎందుకు కూల్చారని ఆయన ప్రశ్నించారు. మరో కాంగ్రెస్‌ సభ్యుడు టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉపన్యాసంలో ప్రస్తావించిన అభివృద్ధంతా ప్రణాళికల స్థాయిలోనే ఉందన్నారు. టీడీపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ హైదరాబాద్‌లో కాలం చెల్లిన చెరువులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్‌ చేశారు.

ఏం మెరుగుపడింది?
రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌ నగరం ఏ విషయంలో మెరుగుపడిందో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గాలిలో మేడలు కడుతూ ఇదే హైదరాబాద్‌ అభివృద్ధి అని ప్రభుత్వం అనుకుంటోందని, కన్సల్టెంట్లు గీసిన డ్రాయింగ్‌లను పత్రికలకు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కనీసం జీహెచ్‌ఎంసీలో రోడ్లు వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. టాటా, రిలయన్స్  కంపెనీలు జీహెచ్‌ఎంసీ రోడ్లను తవ్వుతుంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా, కిషన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులు అడ్డుపడబోగా.. హైదరాబాద్‌కు పట్టిన పీడ మజ్లిస్‌ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు