ప్రజల్లో మార్పు రావాలి: కేటీఆర్‌

7 Jan, 2018 03:05 IST|Sakshi
మన నగరం కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

లేకుంటే ఎన్ని కోట్లు ఖర్చు చేసినా వృథా  

నీటి సంరక్షణకు త్వరలో ‘జలం–జీవం’ 

‘మన నగరం’ కార్యక్రమంలో ఐటీ మంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: కోటికిపైగా జనాభా ఉన్న నగరంలో ప్రజలందరి భాగస్వామ్యం లేనిదే ఏ పనీ విజయవంతం కాదని, ప్రతి ఒక్కరూ మన నగరం అనుకునే భావనతో పనిచేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మహా నగరంలో నీటి సంరక్షణ కోసం త్వరలో ‘జలం– జీవం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. నీటికి ఇక్కట్లు లేకుండా ఉండాలంటే నీటి సంరక్షణ తప్పనిసరి అన్నారు. దీని కోసం ఆర్నెల్లపాటు ఈ అంశంపై అందరికీ అవగాహన కల్పించి, ఆ తర్వాత నీటి సంరక్షణ చర్యలు చేపట్టని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌ మియాపూర్‌లో నిర్వహించిన ‘మన నగరం’కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... నగరంలో 300 చ.మీ.లు దాటిన భవనాలకు ఇంకుడు గుంతలు లేకుంటే ఓసీ ఇవ్వరాదని ఉన్నా అది అమలు కావడం లేదన్నారు. ఇకపై ఈ పరిస్థితి లేకుండా ఇంకుడు గుంతలు నిర్మించని భవన యజమానితోపాటు, సంబంధిత అధికారికీ జరిమానా విధిస్తామన్నారు. వంద అపార్ట్‌మెంట్లు దాటిన గేటెడ్‌ కమ్యూనిటీకి ఎస్టీపీ తప్పనిసరి అన్నారు. నీటిని సంరక్షించుకోకుంటే భవిష్యత్‌లో ఇక్కట్లు తప్పవని హెచ్చరించారు. ఇంకుడు గుంతలపై ప్రజలను చైతన్యపరిచేందుకు జోనల్, డిప్యూటీ కమిషనర్లు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.  

రూ.3,100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ.. 
గ్రేటర్‌లో కలసిన శివారు మునిసిపాలిటీల్లో రూ.3,100 కోట్లతో భూగర్భ డ్రైనేజీని సంవత్సర కాలంలో చేపడతామన్నారు. ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ప్రజల్లో మార్పురానిదే పరిస్థితి మారదంటూ నాలాల్లో చెత్త, ప్లాస్టిక్‌ కవర్లను వేస్తుండటాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక సర్కిల్‌లో ఆయా రంగాల్లో ఉత్తమంగా నిలిచిన ఉత్తమ కాలనీల ప్రతినిధులు, స్వచ్ఛ సేవలు అందించిన వారికి మంత్రి కేటీఆర్‌ పురస్కారాలు అందజేశారు. అంతకు ముందు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మా ఇంటి నేస్తం’లో భాగంగా వీధి కుక్క పిల్లల దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ప్రభుత్వ స్థలాలను కాపాడండి... 
సర్కిల్‌లోని పార్కు స్థలాలు కబ్జా అవుతున్నాయని, వాటిని కాపాడాలని మంత్రిని సర్కిల్‌ వాసులు కోరారు. శంకర్‌నగర్‌ కాలనీలో ఎంతో ప్రభుత్వ భూమి ఉందని, సర్వే చేయించి, ప్రజోపయోగార్థం వినియోగించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. తమ ఇబ్బందుల పరిష్కారానికి అవసరమైన రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు