జనం పరిస్థితి అధ్వానం ఇది మన'ఉద్ధానం'

16 Aug, 2017 03:26 IST|Sakshi
జనం పరిస్థితి అధ్వానం ఇది మన'ఉద్ధానం'
- కృష్ణమ్మ, తుంగభద్ర తీరాన కిడ్నీ వ్యాధులతో అవస్థలు  
నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో జనం వెతలు 
గువ్వలగుట్ట, యాపదిన్నెలో దారుణ పరిస్థితి
 
మేకల కల్యాణ్‌చక్రవర్తి, వర్ధెల్లి వెంకటేశ్వర్లు సాక్షి, హైదరాబాద్‌:
పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. చుట్టూ కృష్ణా నది.. ఆహ్లాదకర వాతావరణం.. మధ్యలో గువ్వలగుట్ట. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న ఈ ఊరు కిడ్నీ సంబంధ వ్యాధులతో వణికిపోతోంది. ఊరి జనాభా దాదాపు 600 కాగా.. అందులో సగానికి సగం మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఐదేళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అందరినీ చుట్టుబెడుతోంది ఈ వ్యాధి. ఇక్కడే కాదు.. తుంగభద్ర తీర ప్రాంత పల్లెలనూ ఈ మాయరోగం వెంటాడుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజా, ఇటిక్యాల, మనోపాడు మండలాల ప్రజలు కిడ్నీ వ్యాధులతో నానా గోస పడుతున్నారు. ఐజా మండలం యాపదిన్నె గ్రామంలో 600 కుటుంబాలు ఉండగా.. ప్రతి మూడు ఇళ్లకు ఒక కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉన్నారు. గత నాలుగేళ్లలో ఏకంగా 17 మంది చనిపోయారు. మరో 15 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మరణించిన వారిలో 75 శాతం మంది 40 ఏళ్ల లోపు యువతే. ఈ రెండు పల్లెల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల వెతలు శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో పరిస్థితిని తలపిస్తున్నాయి.
 
చెంతనే కృష్ణా.. అయినా సుద్దనీరు
కృష్ణానది బ్యాక్‌వాటర్‌ ఒడ్డున ఉంటుంది గువ్వలగుట్ట. ఇక్కడ నివసించేవారికి ప్రతిరోజూ కృష్ణమ్మ దర్శనమిస్తూనే ఉంటుంది. కానీ 15 ఏళ్ల నుంచి ఈ ఊళ్లో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ కిడ్నీల వ్యాధి బారిన పడుతున్నారు. తలాపునే కృష్ణమ్మ ఉన్నా ఆ నీరు వచ్చే పరిస్థితి లేక సుద్ద నీళ్లు తాగుతున్నారు. దీంతో సగానికిపైగా గ్రామస్తులు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. వాంతులతో ప్రారంభమై నడుము నొప్పి వచ్చిందంటే ఇక వాళ్లు కిడ్నీ డాక్టర్‌ బాట పట్టాల్సిందే. ఊరిలో ఇప్పటికే 100 మంది కిడ్నీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఇక్కడి మహిళలు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారంటే అనారోగ్య సమస్యలతో అనివార్యంగా గర్భసంచి తీయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తుల్లో నిస్సత్తువ ఆవరిస్తోంది. చాలామంది ఎక్కువ సేపు నడవలేరు.

పని చేయలేరు. కనీసం మాట్లాడనూ లేరు. ‘సాక్షి’ ప్రతినిధి వెళ్లిన సమయంలో ఊళ్లో.. 150–200 మంది వరకు ఉన్నారు. మిగతా వారు పొలం పనులకు వెళ్లారు. ఊళ్లోని మాలచ్చమ్మ గుడి వద్దకు ఓ 70 మంది వరకు వచ్చారు. వారితో అక్కడే 20–25 నిమిషాలు మాట్లాడిన తర్వా త చూస్తే 70 శాతం మంది కింద కూర్చుండిపోయారు. అంతలో ఓ 40 ఏళ్ల మనిషి మాట్లాడుతూ.. ‘‘చూసిండ్రా సారూ...! మీరు మాట్లాడుతుంటేనే అందరూ ఎలా కూర్చున్నారో.. పట్టుమని పది నిమిషాలు కూడా మేం నిలబడలేం. కాళ్లు నొప్పులు వచ్చినందుకే కూర్చున్నాం..’’ అని అన్నాడు. 
 
పోలీసులు ప్లాంట్‌ ఇచ్చినా.. కరెంటు లేక..
గువ్వలగుట్టలో కిడ్నీల సమస్య ఉందని తెలియడంతో గతంలో ఎస్పీగా పనిచేసిన విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ ఓ వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.లక్ష వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ ఇప్పుడు ఊళ్లో లేదు. ఎందుకంటే ప్లాంట్‌ పనిచేసేందుకు తగినంత కరెంటు కూడా రావడం లేదు. తక్కువ వోల్టేజీ కరెంటుతో ప్లాంట్‌ నడవకపోవడం, స్థానికులకు మెయింటెనెన్స్‌ తెలియకపోవడంతో మళ్లీ పోలీసులే వచ్చి ప్లాంటును తీసుకెళ్లారు. ఈ ఊరు కంబాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. కంబాలపల్లిని గ్రామజ్యోతి కింద రాష్ట్ర విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. అయినా పక్కనున్న గువ్వలగుట్టలో విద్యుత్‌ పరిస్థితి మెరుగుపడలేదు.
 
మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు
మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకుల చిన్నచూపు, అధికారుల నిర్లక్ష్యం కలిసి మా జీవితాల్ని ఆగమాగం చేస్తున్నయ్‌.
– రమావత్‌ సక్రు, గువ్వలగుట్ట నుంచి మొదటి గ్రాడ్యుయేట్‌
 
30 వేలు తీసుకొని ఆపరేషన్‌కు రమ్మన్నారు
నాకు కిడ్నీ సమస్య ఉంది. నొప్పితో కనీసం పడుకునే పరి స్థితి కూడా లేదు. హాస్పిటల్‌కు పోతే ఆపరేషన్‌కు రూ.30 వేలు తీసుకుని రమ్మన్నారు. ఊరంతా ఇదే సమస్య.
–వడ్త్యా రవి, గువ్వలగుట్ట
 
అన్నం కాదు.. మంచినీళ్లు ఇవ్వండి..
మాకు బస్సొద్దు. ఇళ్లూ వద్దు. ఏమీ వద్దు.. అన్నం లేకున్నా సరే.. మంచినీళ్లు ఇవ్వండి. అవి వస్తేనే బతుకుతాం. ఇట్లాగే ఉంటే మేం 40 ఏళ్లు కూడా బతకడం కష్టమే. అది కూడా డబ్బులు పెడితేనే. లేదంటే ఎప్పుడు పోతామో తెలియదు.
– ముడావత్‌ లక్ష్మణ్, గువ్వలగుట్ట
 
యాపదిన్నె యాతన ఇదీ..
‘సాక్షి’ ప్రతినిధి యాపదిన్నెకు వెళ్లినరోజున జయలక్ష్మి అనే మహిళ ఇంట్లో దశదిన ఖర్మ చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఆమె కిడ్నీ వ్యాధి బారిన పడి మరణించింది. ఉన్న రెండెకరాలు అమ్మి వైద్యం చేయించుకుంది. ప్రతి మూడ్రోజులకు ఓసారి మహబూ బ్‌నగర్‌ వెళ్లి డయాలసిస్‌ చేయించుకొని వచ్చేది. చివరికి ఆసుప త్రిలో చికిత్స పొందుతూనే మరణించింది. ఈ ఊరి పక్కన నుంచే తాండవ వాగు పారుతుంది. వాగుల్లో నీళ్లున్నప్పుడు ఊళ్లో బోర్లు పోస్తాయి. లేదంటే వ్యవసాయ బావుల నుంచి నీళ్లు  తెచ్చుకోవా ల్సిందే. చేను చెలకల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పంట పొలాల్లో ఉన్నంతసేపు రైతులు నీళ్లు తాగటం లేదు. తీవ్ర అలసట, డీహైడ్రేషన్‌తో కండరాల నొప్పుల బారిన పడుతున్నారు. ఒంటి నొప్పుల నివారణకు ఇంజెక్షన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు.
 
కూర్చున్నా.. నిల్చున్నా.. నడుంనొప్పి
నాకు కిడ్నీ రోగం వచ్చి ఆరు నెలలు దాటింది. కూర్చున్నా.. నిలబడ్డా నడుంనొప్పి వస్తోంది. ఎప్పుడూ నడవాలనిపిస్తది. కానీ నడవటానికి చేతకాదు. ఇప్పుడే మొదలైందట. నెలకు రూ 3వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నా.
– చాకలి రాములు, యాపదిన్నె 
 
నాకు, నాయినకు కిడ్నీ జబ్బు..
మా నాయిన కిడ్నీ రోగంతోనే ఉన్నడు. ఇప్పుడు నాకు కూడా ఉన్నట్లు తేలింది. మా అన్న పొలం లో ఏడు గంటలు పని చేస్తడు. నేను రెండు గంటలు కూడా చేయలేకపోతున్న. నాయిన మంచం మీదనే ఉన్నడు. మందులు తింటుండు కానీ ఎక్కువ రోజులు కాలం గడుపుడు కష్టమే అనిపిస్తంది.
– బొర్ల కిష్టన్న, యాపదిన్నె
 
రోగం కమ్ముకొస్తోంది
పిలగాళ్లు సూత్తానికి బాగానే కనిపిస్తున్నరు. కానీ లోపల నుంచి రోగం కమ్ముకొస్తోంది. ఇప్పటికే 20 మందికి పైగా చనిపోయారు. ఊర్లే ఇంకో 15.. 20 మందికి రోగం ఉంది. ఇంకా ఎంత మందికి ఉందో తెల్వదు. ఈ రోగం మా ఎమ్మట ఎందుకు పడ్డదో అర్థం కాట్లేదు.
– రామకృష్ణ, గ్రామపెద్ద, యాపదిన్నె
 
 ఈ చిత్రంలో కనిపిస్తున్న బాబు పేరు మేరావత్‌ లక్ష్మణ్‌. 12 ఏళ్లుంటాయి. చిన్నతనంలోనే కిడ్నీల వ్యాధి బారిన పడ్డాడు. చికిత్స కోసం ఆయన తల్లిదండ్రులు ఇల్లు, పొలం అమ్ముకున్నారు. 100 జీవాలూ అమ్ముకున్నా రు. ఇప్పుడు వేరే ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. 10 నెలల క్రితం లక్ష్మణ్‌ హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరాడు. అయినా ఫలితం లేకపోవడంతో లాభం లేదని ఇంటికి తెచ్చారు.
 
ఈ చిత్రంలో కనిపిస్తున్న పాప పేరు ముడావత్‌ స్వప్న. వయసు ఐదేళ్లు. ఆపకుండా ఏడుస్తుంటే ఏమైందని ‘సాక్షి’ ప్రతినిధి అడగ్గా.. ‘‘ఏముంది సారూ..! మాయదారి కిడ్నీ జబ్బే. కొంచెం దూరం కూడా నడవలేదు. ఎప్పుడూ ఎత్తుకునే ఉండాలి. నాలుగడుగులు వేస్తే రొప్పుతుంది. ఒకటే ఏడుస్తుంది..’’ అని చిన్నారి అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.
 
 
ఈసారి ఓట్లకొస్తే గడగొయ్యలే
మా ఊరికి ఎమ్మెల్యే రాడు.. ఎంపీ రాడు.. ఎవ్వరూ రారు. ఓట్ల సమయంలో వచ్చి మాలచ్చమ్మ గుడి దగ్గర మీటింగ్‌లు పెట్టి ప్రమాణాలు చేస్తరు. కానీ ఆ తర్వాత పట్టించుకోరు. ఈసారి ఓట్ల కోసం వస్తే గడగొయ్యలే అందుకుంటం. కృష్ణానది రోజూ కనపడుతుంది. కానీ, మా కడుపులోకి పోయేది మాత్రం సుద్ద నీళ్లు..అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.
మరిన్ని వార్తలు