ప్రజల భాగస్వామ్యంతోనే బంగారు తెలంగాణ

28 Jun, 2016 02:10 IST|Sakshi
ప్రజల భాగస్వామ్యంతోనే బంగారు తెలంగాణ

* ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ హనుమంతరావు  
* ప్రారంభమైన ‘తెలంగాణ సాధికారత’ ఓరియెంటేషన్ కార్యక్రమం

సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని కేంద్ర ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ హనుమంతరావు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రణాళిక శాఖకు చెందిన గెజిటెడ్ అధికారులకు ‘తెలంగాణ సాధికారత’ పేరిట ఏర్పాటు చేసిన మూడు రోజుల ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఇందులో హనుమంతరావు మాట్లాడుతూ... ‘ప్రపంచీకరణ ద్వారా అన్ని వర్గాల్లోనూ సమానత్వం సాధ్యపడదు. సమానత్వాన్ని సాధించాక ప్రపంచీకరణతో అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రపంచీకరణ జరుగుతున్న దశలో తెలంగాణ ఏర్పాటైనందున ఆ ప్రయోజనాలను సంపూర్ణంగా పొందగలగాలి. అందుకు అన్ని స్థాయిల్లోనూ అధికార వికేంద్రీకరణే అత్యుత్తమ మార్గమం. నాణ్యమైన విద్య అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి.

ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుండడం అభినందనీయం. నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన కేజీ టు పీజీ పథకం మంచిదే అయినప్పటికీ సరైన ప్రణాళిక లేనందున అది అమలుకు నోచుకోలేదు. తాగు, సాగునీటికి గోదావరి నది నుంచి నీటిని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాలనే ప్రజలు అధికంగా వినియోగిస్తున్నారు’ అన్నారు.
 
సమర్థవంతమైన ప్రణాళికలు అవసరం...
ప్రజలు, ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరాలంటే రాష్ట్రంలోని ప్రణాళిక మండలి సమర్థవంతంగా పనిచేయాలని హనుమంతరావు సూచించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో సాధారణ ఉద్యోగి నుంచి సివిల్ సర్వెంట్ వరకు ప్రతి ఒక్కరికీ సరైన శిక్షణ, సాంకేతిక సహకారాన్ని అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు విద్యుత్, పర్యావరణం సంబంధిత అంశాల్లో నాణ్యమైన సేవలు ప్రజలకు అందేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకువచ్చిన మార్పుల ఫలితంగా సమాచార సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయితే.. ఆయన ఆశించిన మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ మాత్రం జరగలేదన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్ జనరల్ వీకే అగర్వాల్ మాట్లాడుతూ... ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులందరూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద గురించి మరింతగా తెలుసుకోగలిగినప్పుడే, ప్రజల ఆకాం క్షలకు అనుగుణంగా విధులను నిర్వహించగలుగుతారని చెప్పారు.

బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య సూచిం చారు. ప్రభుత్వ సలహాదారులు జి.ఆర్.రెడ్డి, ఎ.కె.గోయల్, కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ రావులపాటి మాధవి, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ అదనపు డెరైక్టర్ జనరల్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు