హే...కృష్ణా!

24 Apr, 2015 01:59 IST|Sakshi
హే...కృష్ణా!

కృష్ణా మూడో దశతో పాక్షికంగా నీటి సరఫరా
శివార్లలో ఇంకా తీరని దాహార్తి
అసంపూర్తిగా ఫిల్టర్‌బెడ్స్, జంక్షన్లు, రింగ్‌మెయిన్ నిర్మాణం
అల్లాడుతున్న జనం

 
సాక్షి, సిటీబ్యూరో :  కృష్ణా మూడోదశ ట్రయల్న్‌త్రో నగరానికి పాక్షికంగా మంచినీటి సరఫరా జరుగుతున్నా... శివార్ల దాహార్తి తీరడం లేదు. నగరానికి అదనంగా 22.5 మిలియన్ గ్యాలన్ల జలాలను తరలిస్తున్నట్లు జలమండలి ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.. ప్రయోజనం కనిపించడం లేదు. మూడో దశలో భాగంగా న ల్గొండ  జిల్లా కోదండాపూర్ వద్ద సుమారు 34 ఫిల్టర్‌బెడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం... నీటిని నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు అవసరమైన రింగ్‌మెయిన్-1 పనుల్లో ఐదు కిలోమీటర్లు అసంపూర్తిగా ఉండడం... జంక్షన్ల నిర్మాణ పనులు టెండర్ల దశలో ఉండడంతో మూడో దశతో దాహార్తి తీరుతుందనుకున్న వారు మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పని దుస్థితి నెలకొంది.

లెక్కల చిక్కులు..
కృష్ణా మూడోదశలో కోదండాపూర్‌లో నిర్మించాల్సిన 40 ఫిల్టర్‌బెడ్లలో ఇప్పటికి కేవలం 6 మాత్రమే పూర్తయినట్లు సమాచారం. మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసిన 8 మోటార్లలో రెండింటిని మాత్రమే ప్రారంభించి.. నగరానికి నిత్యం 22.5 ఎంజీడీల నీటిని  పంపింగ్ చేస్తున్నట్లు తెలిసింది. కృష్ణా        ఫేజ్-1, ఫేజ్-2లో సరఫరా చేస్తున్న 180 ఎంజీడీలలో కొంత మేర తగ్గించి... మూడోదశలో  22.5 ఎంజీడీలు సరఫరా చేస్తున్నట్లు అంకెల గారడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. కొందరు అధికారులు ఏకంగా మూడోదశలో అదనంగా నిత్యం 30 ఎంజీడీలు తరలిస్తున్నట్లు సర్కారు పెద్దలు, మంత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సెప్టెంబర్ వరకూ నిరీక్షణ
రూ.1670 కోట్ల అంచనాతో చేపట్టిన కృష్ణా మూడోదశలో నగరానికి పూర్తి స్థాయిలో 90 ఎంజీడీలు తరలించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఈ నీటిని తీవ్ర దాహార్తితో అలమటిస్తున్న ఉప్పల్, కాప్రా, మల్కాజ్‌గిరి, అల్వాల్, సైనిక్‌పురి, బోడుప్పల్, ప్రశాసన్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి తదితర ప్రాంతాలకు రెండురోజులకోమారు సరఫరా చేయాంటే సుమారు 50జంక్షన్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది.

ఈ పనులకు ప్రస్తుతం జలమండలి టెండర్ల ప్రక్రియను చేపట్టింది. మరోవైపు రింగ్‌మెయిన్-1లో ఐదు కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధాన నగరంలో ట్రాఫిక్ చిక్కులు, జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన రహదారి కోత అనుమతులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ పనులు మందగమనంలో సాగుతున్నాయి.

ఇక కోదండాపూర్‌లోనూ 34 ఫిల్టర్‌బెడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఈ కారణాల రీత్యా మూడోదశను పూర్తి స్థాయిలో సాకారం చేయాలంటే ఈ ఏడాది సెప్టెంబరు వరకు నిరీక్షించకతప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహిస్తేనే త్వరితగతిన పూర్తవుతాయని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు