ట‘మోత’..

29 Oct, 2013 04:55 IST|Sakshi

 

= కేజీ రూ. 50-55 ఉల్లిబాటలోనే
 =ఇతర కూరగాయలు
 = వర్షాలతో దెబ్బతిన్న పంటలు
 =దిగుమతి తగ్గి ధరలపై ప్రభావం
 = విలవిల్లాడుతున్న వినియోగదారులు

 
సాక్షి, సిటీబ్యూరో: అసలే ఉల్లి ధర కళ్లు బైర్లుకమ్మిస్తోంటే.. తామేమీ తక్కువ కాదంటూ ఇతర రకాల కూరగాయలూ చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాలతో పంట దెబ్బతిని నగరానికి దిగుమతులు తగ్గిపోయాయి. ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడింది. ప్రత్యేకించి టమోట ధర  ఠారెత్తిస్తోంది. రిటైల్ మార్కెట్లో కేజీ రూ.50-55 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు రిటైల్ మార్కెట్లో ఏ రకం కొందామన్నా కేజీ రూ.35-60 ధర పలుకుతున్నాయి. వర్షాలకు ముందు ఇవి కేజీ రూ.30కే లభించాయి.

మదనపల్లి నుంచి దిగుమతి పడిపోవడంతో టమోట మార్కెట్‌పై ప్రభావం పడింది. అలాగే వర్షాల కారణంగా రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే దిగుమతులూ పూర్తిగా పడిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచీ దిగుబడి అంతంతగానే ఉంది. దీంతో అసమతౌల్యం ఏర్పడి కూరగాయల ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి.

 సగానికి పడిపోయిన సరఫరా

 నగరంలో రోజూవారీ 1.25 లక్షల క్వింటాళ్ల కూరగాయలు అవసరం. ఇప్పుడు సరఫరా అవుతున్న కూరగాయలు ఇందులో సగమే. గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, మీరాలంమండి, మాదన్నపేట, ఎల్బీనగర్‌లలోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజూ 25 వేల క్వింటాళ్లలోపే కూరగాయలు వస్తున్నాయి. 9 రైతుబజార్లకు 1000 క్వింటాళ్లు, మిగతా ప్రైవేటు మార్కెట్లు, మాల్స్‌కు 20 వేల క్వింటాళ్లు.. మొత్తం 46 వేల క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఈ లెక్కన 54 వేల క్వింటాళ్ల కొరత ఏర్పడుతోంది.

ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచేశారు. ఇక, కేజీ ఉల్లి ప్రస్తుతం కేజీ రూ.60-65కి ఎగబాకింది. ఒక్కోరోజు టోకు మార్కెట్లో ధర తగ్గినా... రిటైల్ వ్యాపారులు అధిక ధరలనే వసూలు చేస్తున్నారు. నగరంలో రోజుకు 1200 టన్నుల ఉల్లి అవసరం ఉండగా అందులో సగమే దిగుమతవుతోంది. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖలో స్పందన కరువైంది.
 

మరిన్ని వార్తలు