8మంది నిందితులను గుర్తించిన పోలీసులు

1 Apr, 2014 13:12 IST|Sakshi

హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఇద్దరు ఎస్ఐలపై చేయి చేసుకున్న కేసుపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం సమావేశం అయ్యారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎనిమిదిమంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లు అల్వాల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చిరించారు.

కాగా పూటుగా మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించడంతో అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు .. ఇక అంతే.. తనపై పోలీసులు దాడి చేశారని హడావిడి చేసి అందరినీ తప్పుదోవ పట్టించాడు. ఈక్రమంలో కొంత మంది ఆదివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌పై రాళ్లతో దాడి చేసి అడ్డొచ్చిన ఇద్దరు ఎస్సైలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా ఎనిమిదిమందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి అల్వాల్ ట్రాఫిక్ ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో డ్రంకన్ డ్రైవ్ విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలకు ఎర్రగడ్డకు చెందిన జగదీష్ తయార్(50) మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేసేందుకు యత్నించగా అందుకు నిరాకరించాడు. దీంతో లా అండ్ ఆర్డర్ ఎస్సై తిరుపతి సిబ్బందితో అక్కడికి చేరుకుని బలవంతంగా జగదీష్‌కు పరీక్ష చేయగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు నమోదైంది.
 
 అయితే, జగదీష్ తన పేరుకు బదులు పక్క సీట్లో కూర్చున్న సురేష్ అగర్వాల్ పేరును తన పేరుగా చెప్పాడు. అంతే కాకుండా తనపై పోలీసులు దాడి చేస్తున్నారని.. వచ్చి కాపాడండంటూ కొంపల్లి థోలారిధనిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇక అంతే.. నాలుగు బస్సుల్లో తిరుగు ప్రయాణంలో ఉన్న వారంతా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రాళ్లతో దాడి చేసి అడ్డుకున్న ఎస్సై పురుషోత్తం, తిరుపతిపై దాడికి దిగారు.

మరిన్ని వార్తలు