అక్రెడిటేషన్ల కమిటీని రద్దు చేయాలి

1 Aug, 2015 02:04 IST|Sakshi

హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రంలోని పాత్రికేయులకు అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, కార్డుల జారీకి నేరుగా రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ల కమిటీ (ఎస్‌ఎల్‌ఏసీ)ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను, మార్గదర్శకాలను రూపొందించకుండానే అక్రెడిటేషన్ల జారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ల కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 197 జారీ చేసింది. ఈ కమిటీ ఇష్టానుసారం అక్రెడిటేషన్లను జారీ చేస్తోంది. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని పిటిషనర్ షేక్ ఖాసీం కోరారు.

మరిన్ని వార్తలు