రేపు అర్ధరాత్రి నుంచి.. పెట్రో ట్యాంకర్ల సమ్మె

28 May, 2016 01:11 IST|Sakshi
రేపు అర్ధరాత్రి నుంచి.. పెట్రో ట్యాంకర్ల సమ్మె

పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్ విధించినందుకే..
వెంటనే ఉపసంహరించాలని డిమాండ్
మద్దతు ప్రకటించిన డీలర్స్ అసోసియేషన్
జూన్ 5 నుంచి సొంత ట్యాంకర్లనూ నిలిపేస్తాం: టీపీడీఏ
 
హైదరాబాద్: పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్ విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ అసోసియేషన్ ఈ నెల 29 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (టీపీడీఏ) మద్దతు పలికింది.
 
 ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ (హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీడీఏ అధ్యక్షుడు ఎన్. దినేశ్‌రెడ్డి, ఆల్ ఇండియా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి రాజీవ్ అమరం, తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు కె. రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆరీఫ్- ఉల్-హుస్సేన్‌లు మాట్లాడారు. సమాజాభివృద్ధికి ఇంధనం ఎంతో కీలకమని... పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై ప్రభుత్వం 14.5 వ్యాట్ విధించడం సరికాదని...వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రవాణా బంద్ వల్ల జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
 
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన, విధించబోయే పన్నులను చమురు కంపెనీలే భరించాలని, రవాణా, కాంట్రాక్ట్‌దారులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము ఇప్పటికే తక్కువ ధరకు పెట్రోలియం రవాణా టెండర్లను దక్కించుకున్నామని...అటువంటి తమపై వ్యాట్ విధింపు సరికాదన్నారు. రాష్ట్ర సమస్యలపై మానవత్వంతో స్పందించే సీఎం కేసీఆర్ పెట్రోలియం రవాణాపై విధించిన వ్యాట్‌ను తగ్గించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
 
 దేశంలో ఏ రాష్ట్రంలోనూ పెట్రోలియం రవాణా చార్జీలపై వ్యాట్ లేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతినిధులు ఆరోపించారు. జూన్ 5 నుంచి తమ సొంత ట్యాంకర్ల రవాణానూ నిలిపేసి పెట్రోలియం రవాణాను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. వ్యాట్‌పై ఆర్థిక మంత్రి, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, ఆయిల్ కంపెనీ అధికారులను కలసి వినతిపత్రాలను సమర్పించామని... అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఉధృతంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ట్యాంకర్స్ ఓనర్స్, డీలర్స్ కూడా పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా