ఫిలిప్పీన్స్ మహిళకు పర్యాటక శాఖ బాసట

3 May, 2016 03:38 IST|Sakshi
ఫిలిప్పీన్స్ మహిళకు పర్యాటక శాఖ బాసట

♦ విమానంలో ప్రసవం... హైదరాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
♦ పురిట్లో బిడ్డ చనిపోయి... తిరిగి వెళ్లేందుకు డబ్బులు లేక అవస్థలు
♦ ఆసుపత్రికి వెళ్లి ఆమె దుస్థితి చూసి చలించిన పర్యాటక ముఖ్యకార్యదర్శి
♦ శిశువు అంత్యక్రియలు, తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు
 
 సాక్షి, హైదరాబాద్: నిండు గర్భిణి... విదేశంలో ఉద్యోగం... ప్రసవం కోసం స్వదేశానికి పయనం. అంతలోనే అవాంతరం. విమానంలోనే పురుటి నొప్పులు మొదలై... ఆడబిడ్డకు జన్మనిచ్చిందా మహిళ. పాపకు సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లో అర్ధంతరంగా దిగాల్సి వచ్చింది. అత్యవసర చికిత్స అందించినా... పుట్టిన బిడ్డ కళ్లముందే ఊపిరి విడిచింది. చనిపోయిన పసిగుడ్డుతో స్వదేశానికి వెళ్లలేక... ఇక్కడే అంత్యక్రియలు చేయడానికి నిబంధనలు అంగీకరించక... ఆసుపత్రి ఖర్చు చెల్లించలేక... తిరిగి వెళ్లేందుకు డబ్బు లేక... గుండె కోత అనుభవించిన ఆ తల్లికి తెలంగాణ పర్యాటక శాఖ బాసటగా నిలిచింది.  ఆమె స్వదేశానికి వెళ్లడానికి కావల్సిన ఏర్పాట్లు చేసి ఊరటనిచ్చింది.

 ఫిలిప్పీన్స్ వెళ్తూ...
 దుబాయ్‌లో నర్సుగా పనిచేస్తున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన గ్రేస్ అలెగ్జాండ్రియా గర్భవతి. వారం కిందట ఆమె ప్రసవం కోసం స్వదేశానికి ఎమిరేట్స్ విమానంలో బయలుదేరారు. గగనతలంలోనే గ్రేస్‌కు పురుటి నొప్పులు మొదలయ్యాయి. విమానంలోనే ప్రసవించిన ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే ప్రసవం జరగటంతో శిశువు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అప్పుడు విమానం భారత గగనతలంలో ఉండటంతో పైలట్ అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దింపాడు. వెంటనే ఆమెకు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స ప్రారంభించి, అక్కడి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు బిడ్డను కాపాడలేకపోయారు. ఓవైపు శిశువు చనిపోయిందన్న బాధ గుండె కోత పెడుతుంటే... మరో వైపు శిశువు అంత్యక్రియలు పెద్ద సమస్యగా మారాయి. మృతదేహంతో స్వదేశానికి వెళ్లలేక ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు. కానీ చర్చిల్లో సభ్యత్వం లేనివారికి అంత్యక్రియలు జరిపే అవకాశం లేదని స్థానిక శ్మశానవాటిక నిర్వాహకులు తెలపడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అటు స్వదేశానికి వెళ్లలేక, ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు డబ్బు లేక ఆమె తీవ్ర మనోవేదనకు లోనయ్యారు.
 
 అతిథి దేవోభవ...
 విషయం తెలుసుకున్న తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆమె దుస్థితి చూసి చలించిపోయారు. వెంటనే పోలీసులు, ఇతర విభాగాల అధికారులతో మాట్లాడారు. ఆయన చొరవతో తిరుమలగిరిలోని శ్మశానవాటికలో మంగ ళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి నిర్వాహకులతో చర్చించి చికిత్స బిల్లును తగ్గించేలా చూశారు. సరిపోని పక్షంలో ప్రభుత్వపరంగా సాయం అందించటంతోపాటు ఆమెను స్వదేశానికి పంపేందుకు వీలుగా విమాన టికెట్‌ను ఇచ్చేందుకు కూడా వెంకటేశం ఏర్పాట్లు చేశారు. ముందు ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చే పర్యాటకులే కాకుండా అనుకోని విపత్తులతో వచ్చేవారినీ అతిథులుగా భావించి వారిని అక్కున చేర్చుకోవటం మన ధర్మమని, దాన్ని నిర్వహించేందుకు పర్యాటక శాఖ ముందుకొచ్చిందని వెంకటేశం తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా