వెయ్యి కోట్ల స్థలం..

27 Jul, 2016 23:07 IST|Sakshi
రాయదుర్గం 66/2లో స్థలాన్ని స్వాధీనం చేసుకొని సరిహద్దులు ఏర్పాటు చేసిన దృశ్యం

► శేరిలింగంపల్లిలో సర్కారు స్థలాల ప్రక్షాళన షురూ
► ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే మినహాయింపు


గచ్చిబౌలి: శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూముల ప్రక్షాళన మొదలైంది. రాయదుర్గం నవకల్సాలో దాదాపు వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వెయ్యి కోట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తహసీల్దార్‌ మధుసూదన్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రజిత్‌ కుమార్‌ షైనీ ఆదేశాలతో రాయదుర్గం నవకల్సా సర్వే నెంబర్‌ 66/1, 66/2లో రెండు వారాలుగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రహరీలు, బారికేడ్లు తొలగించి సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. దీంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కబ్జాదారుల్లో బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులున్నట్టు తెలుస్తోంది. తమ పాట్లు, స్థలాలకు మినహాయింపు ఇవ్వాలని వీరు రెవెన్యూ ఉన్నతాధికారులు, మంత్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

40 ఎకరాలకు సరిహద్దులు ...
రాయదుర్గం నవకల్సా సర్వే నెంబర్‌ 66/2లో 45 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 20 ఎకరాలు ప్రభుత్వ స్థలం. కొందరు రియల్టర్లు ఏడాది క్రితం అప్పటి రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో ప్రధాన రహదారి వెంట ఉన్న 4 ఎకరాల స్థలంలో బారికేడ్లు నిర్మించి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ భూములు సర్వే చేపట్టిన అధికారులు ఈ సర్వే నెంబర్‌లో 15 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని సరిహద్దులు నిర్ణయించారు.  ఒవర్‌లాప్‌లో 3 ఎకరాలు చిత్రపురి కాలనీలోకి పోయిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాయదుర్గం సవకల్సా సర్వే నెంబర్‌ 66/1లో  55 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో  5 ఎకరాల్లో  శశ్మానlవాటిక ఉంది. ఈ సర్వే నెంబర్‌లోని ప్రహరీ గోడలను కూల్చి సరిహద్దులు ఏర్పాటు చేశారు.

 

దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వే నెంబర్‌ 66/1, 66/2లలో ఇప్పటికే 40 ఎకరాలకు సరిహద్దులు ఏర్పాటు చేశారు. అక్కడ ఎకరం ధర 25 కోట్ల పైగా ఉంది. గ్రామ మ్యాప్‌ ఆధారంగా ఇప్పటికే ఓ సారి సర్వే చేసిన అధికారుల... ఇందులో సరిహద్దులు సరిగ్గా రాకపోవడంతో డాక్యుమెంట్ల ప్రకారం సర్వే చేస్తున్నారు. శుక్రవారంతో పూర్తి కానున్న ఈ సర్వే అనతరం ఎన్ని ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నారో స్పష్టం కానుంది.


వంద ఎకరాలు గుర్తించాల్సి ఉంది:

- మధుసూదన్‌ , తహసీల్దార్‌ 

రాయదుర్గం సవకల్సా సర్వే నెంబర్‌ 66/1, 66/2, 66/3లో 260 ఎకరాలను ప్రభుత్వ స్థలమని 2001లో అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని శేరిలింగంపల్లి తహసీల్దార్‌ మధుసూదన్‌ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో అప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్లు చెల్లవని చెప్పారు. అయితే, ప్రభుత్వం క్రమబద్ధీకరించినా, కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్లు అయినా మినహాయింపు ఉంటుందన్నారు. నవకల్సాలోని మూడు సర్వే నెంబర్లలో 100 ఎకరాల ప్రభుత్వ  స్థలం గుర్తించాల్సి ఉందన్నారు.  మియాపూర్‌లోని సర్వే నెంబర్‌ 28ను ప్రక్షాళన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అన్ని సర్వే నెంబర్‌లలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి సరిహద్దులు నిర్ణయిస్తామన్నారు.

 

మరిన్ని వార్తలు