బేగంపేటలో కూలిన విమానం

11 Apr, 2016 01:09 IST|Sakshi
బేగంపేటలో కూలిన విమానం

క్రేన్ ఒరిగి కింద పడటంతో రెండు ముక్కలు... ఓ భవనం నేలమట్టం
 విమాన తరలింపు క్రమంలో బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘటన
 ఇరవై టన్నుల భారీకాయం... నూట డెబ్భైమంది సామర్థ్యం... వినువీధిలో వేల కిలోమీటర్లు
 దూసుకుపోయే విహంగాన్ని భువిపై ఒక్క అడుగు కదిపించలేకపోయారు.
 ఆరు భారీ క్రేన్లు... వాటికి అండగా ఆరు ప్రొక్లైనర్లు... వీటన్నింటినీ నడిపించి కార్యం చక్కబెట్టడానికి వందల సంఖ్యలో సిబ్బంది, నిపుణులు, అధికారులు. అంతా కలసి రెండే రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా తరలించడానికి డెబ్భైరెండు గంటలుగా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

వేల మీటర్ల ఎత్తుకెగరగల ఎయిర్‌బస్‌ను క్రేన్‌తో పట్టుమని పదడుగులు కూడా లేపలేక ఎత్తినచోటే  కుదేశారు. ఫలితంగా మూడు రోజుల శ్రమ మూడే నిమిషాల్లో నీరుగారిపోయింది. క్రేన్ తీగ తెగి కింద పడ్డ ‘ఎయిర్ ఇండియా 320 ఎయిర్‌బస్’  చూస్తుండగానే రెండు ముక్కలైంది.  బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ ఆస్తినష్టం జరిగినా అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం  సంభవించలేదు.    - హైదరాబాద్
 
 ఎక్కడ.. ఎందుకు?  
 ఎయిర్ ఇండియాకు చెందిన భారీ ఎయిర్‌బస్ 320 బేగంపేట విమానాశ్రయంలో మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీని పొడవు 111 అడుగులు. బరువు 20 టన్నులు. దీన్ని విమానాశ్రయం సమీపంలోని ఎయిర్ ఇండియాకు చెందిన ‘సెంట్రల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్’ (సీటీఐ)కి తరలించాలని అధికారులు నిర్ణయించారు. బోయిన్‌పల్లి ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు గుండా బాలానగర్ వెళ్లే మార్గంలో ఉన్న సీటీఐలో ఎయిర్ ఇండియా స్టాఫ్‌కు శిక్షణ ఇచ్చేందుకు విమానాన్ని ఉపయోగించుకోవాలన్నది లక్ష్యం.
 
 మూడు రోజుల కసరత్తు...
 విమానాన్ని తరలించేందుకు సీటీఐ అధికారులు మూడు రోజులు కసరత్తు చేశారు. తొలుత విమానంలోని సీట్లు, కాక్‌పిట్‌లోని ఇంజిన్లను తొలగించారు. ఖాళీ బాడీని భారీ క్రేన్ ద్వారా సీటీఐకి తీసుకువెళ్లాలనుకున్నారు. విద్యుత్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల అనుమతులు తీసుకుని వారిని అప్రమత్తం చేశారు. ఎయిర్‌పోర్డు ప్రహరీతో పాటు ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్, కేబుల్స్‌ను యుద్ధప్రాతిపదికన తొలగించారు.
 
 భారీ ఏర్పాట్లు... జాగ్రత్తలు
 ఎయిర్‌బస్‌ను తీసుకెళ్లే భారీ క్రేన్‌తో పాటు మరో ఐదు క్రేన్లు అదనంగా తెప్పించారు. రోడ్డుకు అడ్డంగా ఉండే బండరాళ్లు, చెట్లు తొలగించేందుకు ఆరు ప్రొక్లైనర్లు రప్పించారు. ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించేలా రెండు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కలపి దాదాపు 300 మంది ఇదే పనిలో తలమునకలయ్యారు. శనివారం రాత్రి 11.30 గంటల నుంచే ఓల్డ్‌ఎయిర్‌పోర్టు గుండా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కిలోమీటర్ దూరం వరకు పాదచారులను సైతం అనుమతించలేదు.
 
 తెల్లవారుజాము 3.30 గంటలు...
 ఎయిర్‌లైన్స్ నిపుణుల నేతృత్వంలో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల ప్రాంతంలో భారీ క్రేన్ ఎయిర్‌బస్‌ను పైకి లేపింది. దాన్ని క్రేన్‌బేస్‌పై అమర్చేందుకు మూడు గంటలుగా అంతా శ్రమిస్తున్నారు. ఉదయం 6.30... అంతా సిద్ధం.. మరో పది నిమిషాల్లో క్రేన్ బయలుదేరుతుందని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు, పాదచారుల రాకపోకల్ని పోలీసులు నియంత్రిస్తున్నారు. అంతలోనే అవాంతరం. ఆకాశంలోకి ఎత్తిన విమానాన్ని బేస్‌పై కూర్చోబెట్టే క్రమంలో తీగ తెగి క్రేన్ కుడివైపునకు ఒరిగింది. అధికారులు అప్రమత్తమయ్యే లోపే క్షణాల్లో విమానం రహదారి పక్కనే ఉన్న ఓ భవనంపై పడి రెండు ముక్కలుగా విడిపోయింది. భవనం నేలమట్టమైంది. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనా. కట్టుదిట్టంగా తీసుకున్న జాగ్రత్తల ఫలితంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం తరలింపు బాధ్యతలను దుర్గా క్రేన్స్ సంస్థ తీసుకుంది. వారి తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంత భారీ విమానాన్ని క్రేన్ ద్వారా తరలించడం సరైంది కాదని నిపుణులు అంటున్నారు.   
 
 3 రోజుల్లో తొలగింపు
 విరిగిపోయిన విమాన శకలాలను మూడు రోజుల్లో తొలగిస్తాం. అప్పటి వరకు ఈ మార్గంలో రాకపోకలపై ఆంక్షలుంటాయి. ఈ విమానం మూడేళ్లుగా సర్వీసులో లేదు. మా ఇన్‌స్టిట్యూట్‌లో డోర్ మెయింటెనెన్స్, కాక్‌పిట్ మెయింటెనెన్స్, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో శిక్షణలు ఇచ్చేందుకు మాత్రమే ఎయిర్‌బస్ బాడీని తీసుకెళ్లే ప్రయత్నం చేశాం.      - కెప్టెన్ సోమన్ అతులా , సీటీఐ

                     మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు