క్రమశిక్షణ ఉల్లంఘనలపై కొరడా

10 Nov, 2014 01:31 IST|Sakshi
క్రమశిక్షణ ఉల్లంఘనలపై కొరడా

టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల

* పార్టీ బలోపేతానికి ప్రణాళిక
 * సభ్యత్వ నమోదుపై దృష్టి
* 23న మైనారిటీల సమావేశం
* కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీల సమావేశంలో నిర్ణయం

 
సాక్షి, హైదరాబాద్: పార్టీ నేతలు ఎంతటివారైనా క్రమశిక్షణతో ఉండాలని, హద్దుదాటితే కఠినంగా వ్యవహరించాలని, ఎవరినీ ఉపేక్షించకూడదని నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఆయన పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారితో సమావేశమయ్యారు.

సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి ప్రణాళిక, నేతల సేవల వినియోగం తదితర అంశాలపై చర్చించారు. తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆరోపించిన ఎంపీలు.. ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, సీనియర్లు కల్పించుకుని టీపీసీసీ అధ్యక్షుని నేతృత్వంలోనే సమావేశం జరిగేలా ప్రయత్నించారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలిలో సీఎల్పీ నేత డి.శ్రీనివాస్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

మాజీ  కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, మాజీ ఎంపీ మధు యాష్కి మినహా 16మంది పాల్గొన్న ఈ సమావేశ వివరాలను పొన్నాల మీడియాకు వెల్లడించారు. ‘సభ్యత్వ నమోదుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నాం. 14 నుంచి 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు విస్తృతంగా సభ్యత్వాన్ని నమోదు చేస్తాం. దీనికోసం సమన్వయ కమిటీలనూ నియమిస్తాం. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎంపీలు, మాజీ ఎంపీలే సభ్యత్వ నమోదు బాధ్యతను తీసుకుంటారు. సభ్యత్వ నమోదుపై 23న సమీక్ష నిర్వహిస్తాం.

ఈ సమీక్ష సమావేశానికి ఏఐసీసీ నాయకత్వం కూడా హాజరవుతుంది. అదే రోజు కాంగ్రెస్ మైనారిటీ సెల్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తాం’ అని పొన్నాల తెలిపారు. పార్టీని వదిలి వెళ్లిన ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తాయని, పదవులకు రాజీనామా చే యాలని ఒత్తిడి తెస్తామని ఆయన వివరించారు.

జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమన్వయ కమిటీలను నియమిస్తామన్నారు. ఏఐసీసీ ఏర్పాటు చే సిన టీపీపీసీ సమన్వయ కమిటీలో తమకు స్థానం కల్పించాలని ఎంపీలు, మాజీ ఎంపీలు కోరారని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు