‘ప్లాస్మాపెరసిస్’ పద్ధతిలో యువతికి కిడ్నీ మార్పిడి

7 May, 2015 02:04 IST|Sakshi
‘ప్లాస్మాపెరసిస్’ పద్ధతిలో యువతికి కిడ్నీ మార్పిడి

బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స

హైదరాబాద్: కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న 24 ఏళ్ల యువతికి ‘ప్లాస్మాపెరసిస్’ పద్ధతిలో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ కొత్త పద్ధతి ద్వారా దాత, స్వీకర్త బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయవచ్చని నిరూపించారు. బుధవారం లక్డీకాపూల్ గ్లోబల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్స వివరాల్ని డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు. మియాపూర్‌కు చెందిన కె.నాగేశ్వరరావు కుమార్తె, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన క్రాంతి (24) కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది.

చికిత్స కోసం గ్లోబల్ ఆస్పత్రిలో చీఫ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్‌ను ఆశ్రయించింది. ఆమె రెండు కిడ్నీలు పాడవడంతో కంటిన్యూ డయాలసిస్‌తో పాటు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ సూచించారు. తండ్రి నాగేశ్వరరావు తన రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని కుమార్తెకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో ‘గ్లోబల్’ డాక్టర్లు అధునాతన‘ప్లాస్మాపెరసిస్’ పద్ధతిలో ఇరువురి బ్లడ్‌గ్రూప్స్ మ్యాచ్ కాకపోయినా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. సమావేశంలో గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్ సీఎండీ డాక్టర్ కె. రవీంద్రనాథ్, యూరాలజిస్ట్ డాక్టర్ మాలకొండయ్య, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జె.రమాశంకర్  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు