'ముద్రగడతో మాట్లాడనివ్వండి'

7 Feb, 2016 21:22 IST|Sakshi
'ముద్రగడతో మాట్లాడనివ్వండి'

హైదరాబాద్‌: కాపుల రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంను కలిసి చర్చించేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఆంధప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్‌ రఘువీరారెడ్డి ఆదివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తనతోపాటు చిరంజీవి, పల్లంరాజు, సీ రామచంద్రయ్య సోమవారం ముద్రగడ పద్మనాభంను కలిసి.. సమస్య పరిష్కారం కోసం చర్చిస్తామని, ఈ విషయంలో నిర్మాణత్మక పరిష్కారం రాబట్టేందుకు ప్రయత్నిస్తామని, ఈ విషయంలో పోలీసులు తమను అడ్డుకోకుండా చూడాలని ఆయన కోరారు.

ఈ మేరకు రఘువీరారెడ్డి పార్టీ నేతలతో ఆదివారం రాత్రి హెచ్చార్సీ చైర్మన్‌ను కలిశారు. ఆయన వెంట ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, మాజీ మంత్రి శైలజానాథ్, ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ సీహెచ్ రామశర్మ తదితరులు ఉన్నారు. దీంతో కిర్లంపూడిలోని పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అనంతరం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తాము సోమవారం కిర్లంపూడి వెళ్తున్నామని, తమను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకుంటారనే సమాచారముందని, అందుకే ముద్రగడను కలిసి, మాట్లాడేందుకు అనుమతించాలని హెచ్చార్సీని ఆశ్రయించామని ఆయన చెప్పారు. మరోవైపు ముద్రగడ దీక్ష భగ్నం చేస్తారనే వార్తలతో కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
 

మరిన్ని వార్తలు