అభివృద్ధిని అడ్డుకోవడమే ఎజెండా

15 Oct, 2016 02:46 IST|Sakshi
అభివృద్ధిని అడ్డుకోవడమే ఎజెండా

ప్రతిపక్షాలపై మంత్రి పోచారం ఆరోపణ

 సాక్షి, హైదరాబాద్: రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో ఒక సాకుతో కాంగ్రెస్ నేతలు విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. కల్తీ విత్తన వ్యాపారులు టీఆర్‌ఎస్ నేతల బంధువలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖం డించారు. మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలసి శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

ఐదుగురు నకిలీ విత్తన కంపెనీల యజమానులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 98 మంది సబ్ డీలర్ల లెసైన్సులు రద్దు చేశామని పేర్కొన్నారు. ఆ కంపెనీల నుంచి 60 శాతం అదనపు పరిహారం రైతులకు ఇప్పించామన్నారు. ఈ విషయాలు తెలియకుండా విపక్ష నేతలు నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌ను మించిన ధోఖేబాజ్ పార్టీ ఎక్కడా ఉండదన్నారు. టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓ పిచ్చికుక్క అని పల్లా రాజే శ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న జేఏసీ చైర్మన్ కోదండరాం వ్యాఖ్యలను తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు