రేపటి నుంచి ‘పోలీస్’ దరఖాస్తులు

10 Jan, 2016 03:11 IST|Sakshi
రేపటి నుంచి ‘పోలీస్’ దరఖాస్తులు

♦ మొత్తం 9,281 పోస్టులు... ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల ప్రక్రియ
♦ ఏర్పాట్లు పూర్తి చేసిన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
 
 సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. వివిధ పోలీసు విభాగాల్లో కలిపి భర్తీ చేయనున్న ఈ 9,281 పోస్టులకు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కొలువుల సంఖ్య భారీగా ఉండడం, వయోపరిమితి సడలింపు నేపథ్యంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దరఖాస్తు విధానంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు.

ఈ భర్తీకి సంబంధించి జనరల్ కేటగిరీలో 25 ఏళ్ల వరకు, హోంగార్డులుగా పనిచేస్తున్న వారికి 33ఏళ్ల వయస్సు వరకు వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల్లో నిర్ధారిత వయోపరిమితి అదనంగా వర్తిస్తుంది. ఇక సివిల్ పోలీసు పోస్టుల్లో మహిళలకు 33 శాతం పోస్టులు రిజర్వు చేశారు.

 ఆన్‌లైన్‌లో దరఖాస్తుల విధానం
 రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ కేటగిరీల అభ్యర్థులు రూ.400.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మీసేవ, ఈసేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో సొమ్ము చెల్లించి రసీదు తీసుకోవాలి. అనంతరం ఠీఠీఠీ.్టటఞటఛ.జీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. అప్లైఆన్‌లైన్‌పై క్లిక్ చేయాలి. అందులో సొమ్ము చెల్లించిన రసీదుపై ఉన్న రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి. అనంతరం ‘మైఅప్లికేషన్’లోకి వెళ్లి అభ్యర్థులు తమ పూర్తి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలు తలెత్తితే వెబ్‌సైట్‌లోనే ‘యూజర్ గైడ్’ పరిశీలించి.. నివృత్తి చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థి సెల్‌ఫోన్‌కు, మెయిల్ ఐడీకి వివరాలు అందుతాయి. ప్రిలిమినరీ పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 ఎంపిక విధానంలో మార్పులు
 పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం గతం లో ఉన్న విధానాలను చాలా వరకు మార్చారు. ముఖ్యంగా ఐదు కిలోమీటర్ల పరుగుకు స్వస్తి చెప్పి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై దృష్టి సారించారు. ఎంపిక ప్రక్రియలో మొట్టమొదట ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ (బహుళ ఐచ్ఛిక) విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు... బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ‘ఐదు కిలోమీటర్ల పరుగు (మహిళలకు 2.5 కి.మీ)’ పరీక్షకు బదులుగా పురుషుల విభాగంలో 800 మీటర్లు, మహిళల విభాగంలో 100 మీటర్ల ‘పరుగు’ పరీక్షలు చేస్తారు. చివరగా మెయిన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ స్థాయిలో 200 ప్రశ్నలతో ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో లభించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
 
 ఇదీ సిలబస్..
 కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో ఇంటర్మీడియట్ స్థాయిలో 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఆబ్టెక్టివ్ పద్ధతిలో) ఉంటాయి. ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్స్ ఆఫ్ పార్టెయినింగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇక దేహదారుఢ్య పరీక్షల తర్వాత నిర్వహించే మెయిన్ రాతపరీక్షలోనూ ఇంటర్మీడియట్ స్థాయిలో 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అదనంగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తారు.

మరిన్ని వార్తలు