‘డీసెంట్’గా మోసం

15 May, 2016 02:13 IST|Sakshi

ఒకరిని అరెస్టు చేసిన నగర సైబర్‌క్రైమ్ పోలీసులు
 
సాక్షి, సిటీబ్యూరో
: మేల్/ఫీమేల్ ఎస్కార్ట్ సర్వీసెస్‌లో అవకాశాలు కల్పిస్తామని ఓ దినపత్రికలో ప్రకటనలు ఇచ్చి డబ్బులు తీసుకొని నిరుద్యోగులను మోసం చేసిన ఒకరిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్‌రావు కథనం ప్రకారం...ఫ్రెండ్‌షిప్, మేల్/ఫీమేల్ ఎస్కార్ట్‌లో అవకాశాలతో పాటు ఫ్రెండ్‌షిప్ పరిచయాలు పెంచుతామని బోయిన్‌పల్లిలోని డీసెంట్ సర్వీసెస్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ క్లబ్ పేరిట ఓ దినపత్రికలో నిందితుడు మీర్‌పేటకు చెందిన గోవింద్ వెంకట రమణ ప్రకటన ఇచ్చాడు. దీని పట్ల ఆకర్శితుడైన సికింద్రాబాద్ లాల్‌పేటకు చెందిన గోపు శ్రీనివాస్ సదరు ఫోన్ నంబర్‌లో సంప్రదించగా పల్లవి పేరు గల అమ్మాయి మెంబర్‌షిప్ కోసం రూ.3,600 డిపాజిట్ చేయాలని సూచించడంతో అతను వారు చెప్పిన బ్యాంక్ ఖాతాలో నగదు జమచేశాడు. దీంతో ఆమె దీక్ష అనే అమ్మాయితో మాట్లాడమని ఫోన్ నంబర్ ఇవ్వడంతో శ్రీనివాస్ దీక్షను సంప్రదించగా మలక్‌పేట ఎస్‌బీఐ ఖాతాలో రూ.పదివేలు డిపాజిట్ చేయాలని సూచించింది.

ఆ తర్వాత వారికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని రావడంతో మోసపోయినట్లు గుర్తించిన శ్రీనివాస్ నగర సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితుడు గోవింద్ వెంకట రమణను మీర్‌పేట బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. తన భార్య కృపారాణి ఫోన్‌లో మాట్లాడి మెంబర్‌షిప్ ఫీజు కట్టిస్తుందని, సాహెబ్‌నగర్‌కు చెందిన హుమంత్ రాజ్, ఢిల్లీ వాసి ఆశుతోష్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించుకొని వారికి కమిషన్ ఇచ్చేవాడినని. డబ్బులు డ్రా చేసుకున్నా తర్వాత 20 శాతం కమిషన్ ఇస్తున్నట్లు నిందితుడు వెల్లడించాడు.

>
మరిన్ని వార్తలు