'మీడియా లేని పోలీసింగ్‌ను ఊహించలేం'

22 Sep, 2016 19:08 IST|Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో మీడియా లేకుండా పోలీసింగ్‌ను ఊహించలేమని నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీసులు తీసుకునే ప్రతి చర్యలోనూ మీడియా పాత్ర వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. ప్రతి దశలోనూ పోలీసులకు మీడియా అండగా నిలిచిందని కితాబిచ్చారు. రంజాన్, గణేష్ ఉత్సవాలు, బక్రీద్ పండుగల్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులకు సహకరించిన మీడియాకు కొత్వాల్ గురువారం ఆత్మీయ పూర్వక విందు ఇచ్చారు.

జలవిహార్‌లోని వేదిక హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... 'ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలమైంది. అనేక సందర్భాల్లో పుకార్లను అరికట్టడంతోపాటు నిజానిజాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంలో కీలకపాత్ర పోషిస్తోంది. బుధవారం నగరంలో అనేకచోట్ల బాంబులు ఉన్నాయంటూ పుకార్లు సోషల్ మీడియాలో చెలరేగాయి. దీనిపై నేను ఇచ్చిన వివరణను ప్రజల్లోకి మీడియా తీసుకువెళ్ళి సాధారణ జనజీవనం కొనసాగేలా చేసింది.

నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడంతోపాటు పోలీసింగ్ కోసం పోలీసులు తీసుకుంటున్న ప్రతి చర్యనూ మీడియా ప్రజలకు వివరిస్తోంది. లండన్ నగరం ప్రపంచంలోనే సేఫ్ సిటీగా మారడానికి కారణం అక్కడ దాదాపు పదేళ్ల క్రితం అమలులోకి వచ్చి, నేటికీ కొనసాగుతున్న కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టు. హైదరాబాద్‌లోనూ దాన్ని అమలు చేస్తున్నాం. సిటీలో ఇంతగా సక్సెస్ కావడానికి మీడియా ఇచ్చిన సహకారమే ప్రధాన కారణం. భవిష్యత్తులోనూ మీడియా ఇదే విధమైన సహాయసహకారాలను అందిస్తుందని ఆశిస్తున్నాం'  అని అన్నారు.

>
మరిన్ని వార్తలు