బెటాలియన్లలో ప్రక్షాళన...

6 May, 2018 01:08 IST|Sakshi

అవినీతి కార్యక్రమాలపై పోలీస్‌ శాఖ ఆగ్రహం

ఓ కమాండెంట్‌ను కాపాడేందుకు రంగంలోకి సీనియర్‌ ఐపీఎస్‌

బీడబ్ల్యూవోలను పూర్తిగా మార్చనున్న బెటాలియన్‌ విభాగం

‘సాక్షి’ కథనాలతో బెటాలియన్‌లో కలవరం  

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలో కీలకంగా వ్యవహరించే బెటాలియన్ల విభాగంలో ప్రక్షాళనపై ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్‌లో సంక్షేమ నిధుల స్వాహా వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. మరో బెటాలియన్‌లో బియ్యం స్కాం బయటపడినట్లు తెలిసింది.

దీంతో అన్ని బెటాలియన్లలో అసలు ఏం జరుగుతోంది, అధికారులు ఏం చేస్తున్నారు, ఇంతటి నిర్లక్ష్యం ఏంటని.. ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అన్ని బెటాలియన్లను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ కుంభకోణాలపై ‘సాక్షి’దినపత్రిక ప్రచురిస్తున్న కథనాలు బెటాలియన్లలో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి తగ్గట్టు అధికారుల అవినీతి బాగోతాలపై అందుతున్న వరుస ఫిర్యాదులు ఉన్నతాధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఎంటీవోల అటాచ్‌మెంట్‌ రద్దు..
బెటాలియన్లలో మోటార్‌ ట్రాన్స్‌పోర్టు అధికారి (ఎంటీవో)గా అటాచ్‌మెంట్‌పై పనిచేస్తున్న కొంతమందిని మాతృ యూనిట్లకు బెటాలియన్‌ ఐజీ పంపించినట్టు తెలిసింది. వరుస కుంభకోణాలు వెలుగులోకి రావడం, పైరవీలు చేసి ఎంటీవోలుగా బెటాలియన్‌కు వచ్చిన వారిపై దృష్టి సారించినట్లు తెలిసింది.

ఇదే రీతిలో వచ్చి ఏళ్లపాటు బీడబ్ల్యూవో (బెటాలియన్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌)లుగా ఉన్న వారిని సైతం మార్పు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా 5 బెటాలియన్లలో పనిచేస్తున్న బీడబ్ల్యూవోలపై అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు పోలీస్‌ వర్గాల ద్వారా తెలిసింది.  

వారిని కాపాడటమేంటి?
కొంతమంది బెటాలియన్‌ కమాండెంట్ల తీరుపై యావత్‌ సిబ్బంది తీవ్ర అసహనంగా ఉన్నారు. అయితే కమాండెంట్ల నిర్లక్ష్యం వల్లే కుంభకోణాలు బయటపడుతున్నాయని శాఖకు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేస్తుండగా కీలకమైన బెటాలియన్‌కు చెందిన ఓ కమాండెంట్‌ను రక్షించేందుకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు రంగంలోకి దిగినట్టు బెటాలియన్ల సిబ్బంది చర్చించుకుంటున్నారు.

గతంలో ఆయన పదోన్నతి, పోస్టింగ్‌ విషయంలో హడావుడి సృష్టించి తనకు కావాల్సిన పోస్టింగ్‌ తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు మళ్లీ తనపై ఎలాంటి విచారణ లేకుండా చేసుకునేందుకు సీనియర్‌ ఐపీఎస్‌ తలుపు తట్టినట్లు చర్చ జరుగుతోంది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి తన వెంట ఉన్నంత వరకు తనను ఎవరూ ఏం చేయలేరని ఏకంగా కిందిస్థాయి సిబ్బందికి ఆ కమాండెంట్‌ వార్నింగ్‌ సైతం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరో ముగ్గురు కమాండెంట్లపై గతంలో నుంచే అవినీతి ఆరోపణలు ఉండటంతో వారిపై వేటు తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కుంభకోణాలకు పాల్పడ్డ అధికారులకు చెక్‌ పెట్టకపోతే 1983 కర్నూలు తిరుగుబాటు, 2012లో హైదరాబాద్‌లో జరిగిన తిరుగుబాటును ఎదుర్కోక తప్పదని సిబ్బంది తేల్చిచెప్తున్నారు.

మరిన్ని వార్తలు