అవిశ్రాంతంగా పనిచేస్తున్న పోలీసులు

23 Sep, 2016 19:03 IST|Sakshi

హైదరాబాద్: వాన కష్టాల ‘కడలి’లో ఉన్న సిటీని గట్టెక్కించడానికి పోలీసులు నిర్విరామంగా పని చేస్తున్నారు. సమయంతో పని లేకుండా విధుల్లో నిమగ్నమవుతున్న అధికారులు, సిబ్బంది వరద సహాయకచర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు సైతం ‘రోడ్డెక్కి’ వాహనాలను నియంత్రిస్తున్నారు. రహదారులపై పడిన చెట్లను తొలగించడంలో జీహెచ్‌ఎంసీకి, పునరావాలస కేంద్రాల ఏర్పాటులో రెవెన్యూ యంత్రాంగానికి, నాలాల పర్యవేక్షణలో ఆ విభాగం అధికారులకు, కూలిన గోడల శిథిలాల తొలగింపులో అగ్నిమాపక శాఖకు, రోడ్ల మరమ్మతులో ఆర్ అండ్ డీ అధికారులకు పోటీగా పోలీసులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు అక్రమ పార్కింగ్‌లో ఉన్న వాహనాలను తొలగించడానికి (టోవింగ్ చేయడానికి) వినియోగించిన ట్రాఫిక్ క్రేన్లను ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం కాంక్రీట్, ఇసుక, కంకరు రవాణాకు వాడుతున్నారు.

వీటిని వినియోగించి రోడ్లపై ఉన్న అనేక గుంతల్ని పూడుస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా నిర్విరామంగా విధుల్లో ఉంటూ, వానకి తడుస్తున్న తమ సిబ్బంది ఆరోగ్యంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు అనారోగ్యానికి గురికాకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో రెండు మూడురోజుల పాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరోపక్క రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ శుక్రవారం అల్వాల్‌లో పర్యటించారు. శ్రీనివాసనగర్‌కాలనీ, రెడ్డి కాలనీల్లోని నీట మునిగిన ప్రాంతాలకు వెళ్ళిన ఆయన అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. మోకాలు లోతు నీళ్ళల్లోనూ స్థానిక అధికారులతో కలిసి నడిచిన వెళ్ళిన భగవత్ స్థానికులతో మాట్లాడుతూ వారి ఇబ్బందులు, సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వరదల నేపథ్యంలో ఎలాంటి సహాయసహకారాలు అవసరమైనా పోలీసుల్నీ సంప్రదించవచ్చని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు