పోలీసు ఉద్యోగ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

6 Apr, 2016 05:15 IST|Sakshi
పోలీసు ఉద్యోగ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు వెల్లడి

 హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రాత పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న పరిశీలకులు, సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, పరీక్షాకేంద్రాల సిబ్బందికి జేఎన్‌టీయూహెచ్‌లో మంగళవారం అవగాహన తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న ఎస్‌ఐ సివిల్ విభాగానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, ఎస్‌ఐ కమ్యూనికేషన్స్ విభాగానికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న కానిస్టేబుల్ పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ, 25న ఎస్‌ఐ సీటీవో పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ నిర్వహిస్తామని తెలిపారు.

పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బయో ఇన్విజిలేషన్ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నామని, తరువాత నిర్వహించబోయే దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థుల వేలిముద్రలతో సరిపోల్చడం ద్వారా నకిలీల ఆట కట్టిస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌లతో మాత్రమే పరీక్ష రాయాలని సూచించారు. అనంతరం పరీక్షల కో ఆర్డినేటర్ ఎన్.వి.రమణరావు, కో-కోఆర్డినేటర్ జి.కె.విశ్వనాథ్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకునే అధికారులు, సిబ్బంది విధి విధానాల గురించి వివరించారు. పరీక్షలకు ముందు, తరువాత తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. 

>
మరిన్ని వార్తలు