గంగిరెద్దులను ఆడిస్తే జైలుకే..

3 Jan, 2018 06:57 IST|Sakshi
గంగిరెద్దులను ఆడిస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం

డూడూ బసవన్నలపై పోలీసుల ఆంక్షలు

మాది భిక్షాటన కాదు..కులవృత్తి

గొల్కొండ చౌరస్తాలో గంగిరెద్దులు ఆడిస్తూ నిరసన..

హైదరాబాద్‌ , ముషీరాబాద్‌: కులవృత్తిని నమ్ముకుని తరతరాలుగా బిక్షాటన చేస్తూ జీవిస్తున్న గంగిరెద్దుల కులస్తులను బిక్షగాళ్లుగా పరిగణిస్తూ పోలీసులు అరెస్టు చేయడం దారుణమని పలువురు గంగిరెద్దుల వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20సంవత్సరాలుగా కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్, చిగురు మామిడి తదితర  మండలాల నుంచి 100 నుంచి 150కుటుంబాలు డిసెంబర్‌ మాసంలో నగరానికి చేరుకుంటారన్నారు. సంక్రాంతి వరకు నగరంలో గంగిరెద్దులను ఆడించి జీవనోపాధి పొందిన తర్వాత మళ్లీ తిరిగివెళ్తారని తెలిపారు. ఇటీవల ఇవాంకా ట్రంప్‌ రాక సందర్భంగా బిచ్చగాళ్లను నగరం నుంచి తరలించేందుకు 77సి కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చారని, ఆ చట్టం కింద తమను కూడా చేరుస్తూ అరెస్ట్‌ చేసి జైలుకు పంపిస్తున్నారని అలా దిల్‌షుక్‌నగర్‌లో సోమవారం బత్తుల రాకేష్, గంట అశోక్‌ను జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారికి మద్దతుగా టీమాస్‌ జిల్లా నాయకులు ఎం. శ్రీనివాస్, ఎంబీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిరాజు నరేష్‌ నిలిచి విడిపించారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకపక్క తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంటే పోలీసులు మాత్రం అనాదిగా సంక్రాంతినాడు గంగిరెద్దులను ఆడించే  తమను బిక్షగాళ్లుగా చూస్తూ అరెస్టు చేయడం తగదన్నారు. ఇందుకు నిరసనగా మంగళవారం గొల్కొండ చౌరస్తాలో సుమారు 100కి మందికి పైగా గంగిరెద్దుల కులస్తులు ఎద్దులతో కలిసి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన గంగిరెద్దుల కులస్తులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు, 3ఎకరాల భూమి, ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా పోలీసులు వేధింపుపులు, దాడులు మానుకొని సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గంగిరెద్దుల సంఘం నాయకులు కోటయ్య, అశోక్, సమ్మయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు