తెలంగాణలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది: లక్ష్మణ్‌

26 Dec, 2017 13:12 IST|Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రస్తుతం  పోలీస్ రాజ్యం నడుస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. చంచల్ గూడ జైలులో ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ , ఎంఎల్సీ రాంచందర్ రావు కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కేసీఆర్ నియంత పరిపాలన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 16 శాతం ఉందని, మాదిగలకు విద్య, ఉద్యోగాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో వారు ఎస్సీ వర్గీకరణ కోసం నాయ్య పోరాటం చేస్తున్నారని చెప్పారు.

కేసిఆర్ ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, రైతులు, నాయకులపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం జరుగుతుందని, తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే హింసలు జరిగాయని.. కానీ ఎవరిని జైల్లో పెట్టిన దాఖలాలు లేవన్నారు. కేసీఆర్ ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. అందరితో కలిసి ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు