గ్రామాలకు కాలుష్య కారక ఔషధ పరిశ్రమలా..?

25 Jan, 2018 01:08 IST|Sakshi

కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ కోదండరెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: నగర వాసులకు ఇబ్బందిగా మారిన కాలుష్య కారక ఔషధ పరిశ్రమలను గ్రామాలకు తరలించడం ఎలాంటి పర్యావరణ న్యాయమో చెప్పాలని కిసాన్‌ ఖేత్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ కోదండరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగర శివారు ముచ్చెర్లలో నిర్మించ తలపెట్టిన ఫార్మా సిటీలోకి కాలుష్య కారక పరిశ్రమలు తరలించడం ద్వారా పరిసర గ్రామాలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు.

ఫార్మా సిటీ నిర్మాణంతో లభించే ఉద్యోగాల సంఖ్యపై ప్రభుత్వం గందరగోళంగా మాట్లాడుతోందని విమర్శించారు. 15.95లక్షలు, 8.79లక్షలు, 4.60లక్షల ఉద్యోగాలు వస్తాయంటూ వేర్వేరు సందర్భాల్లో ప్రకటించిన ప్రభుత్వం తాజాగా 5.56లక్షల ఉద్యోగాలే వస్తాయని చెబుతుందన్నారు. ఫార్మా సిటీలో 140 భారీ పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశముంటే, ఒక్కో పరిశ్రమ ద్వారా కేవలం 1,000 మందికి మించి ఉద్యోగావకాశాలు లభించవన్నారు. ఈ లెక్కన కేవలం 1.40లక్షల ఉద్యోగాలు మాత్రమే వస్తాయన్నారు. మిగిలిన 4.16లక్షల ఉద్యోగాలను అక్కడ ఏర్పాటు చేసే 616 చిన్న తరహా పరిశ్రమల్లో కల్పిస్తారా? అని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు