సిటీ గొంతులో గరళం

20 Mar, 2017 02:15 IST|Sakshi
సిటీ గొంతులో గరళం

గ్రేటర్‌లో కలుషితమవుతోన్న భూగర్భ జలం
ఎన్‌జీఆర్‌ఐ అధ్యయనంలో వెల్లడి
ముప్పు తప్పదంటున్న నిపుణులు


సిటీబ్యూరో: నగరం గొంతులో గరళం పడుతోంది. ఇప్పటికే తాగునీటి కోసం అల్లాడుతున్న జనం.. కాలుష్య జలాలతో గొంతు తడుపుకొనే పరిస్థితి నెలకొంది. మండు టెండలకు గ్రేటర్‌లో భూగర్భ జలసిరి ఆవిరయ్యే విషమ పరిస్థితుల్లో ఇది మరో విపత్తు. మహానగరానికి ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడలు, వాటికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు భయంకర మైన కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) తాజా నివేదికలో పేర్కొంది.

160 ప్రాంతాల్లో పరీక్షలు
గ్రేటర్‌ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు హాలాహలంగా మారాయని ఎన్‌జీఆర్‌ఐ నిగ్గుతేల్చడం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలను పరిశ్రమల యజమానులు స్థానిక చెరువులు, కుంటలు, ఖాళీ ప్రాంతాల్లోకి వదిలిపెడుతున్నారు. దీంతో దశాబ్దాలుగా ఈ నీరంతా క్రమంగా భూమిలోకి ఇంకడంతో ఈ దుస్థితి తలెత్తిందని అధ్యయనంలో పేర్కొంది. 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాల, చెరువుల నీటి నమూనాలను ఎన్‌జీఆర్‌ఐ సేకరించి పరీక్షలు నిర్వహించింది. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్‌చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేసింది. ఈ పరీక్షలు దశాబ్ధాలు పీసీబీ నిర్లక్ష్యానికి అద్దంపట్టాయి.

ఆందోళనకరంగా భారలోహాల ఉనికి..
పలు పారిశ్రామిక వాడల్లోని భూగర్భ జలాల్లో భారలోహలు ఉన్నట్టు ఎన్‌జీఆర్‌ఐ నిర్థారించింది. అనేక లోహాలు ప్రమాదస్థాయి మించకపోయినా ఏళ్లతరబడి పరిశ్రమల నుంచి విచక్షణా రహితంగా విడుదల చేసిన రసాయన వ్యర్థాలకు ఇది నిదర్శమని పేర్కొంది. ప్రధానంగా ఖాజిపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్, కాటేదాన్‌ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో భారలోహాలైన లెడ్, క్యాడ్మియం, మాలిబ్డనం, ఆర్సినిక్‌ వంటి లోహాల ఉనికి బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ నీటితో అనర్థాలే..
భార లోహాలున్న నీటిని తాగిన చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోతుంది.
గర్భస్రావాలు జరిగే ప్రమాదం ఉంది.
క్రోమియం వల్ల క్యాన్సర్‌ ముప్పు అధికం.
శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులతో సమస్యలు తప్పవు.
మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంది.
కాలేయం దెబ్బతింటుంది.
ఈ నీటితో సాగుచేసిన కూరగాయలు తిన్నవారికి  తీవ్ర అనారోగ్యం తప్పదు.

మరిన్ని వార్తలు