గ్రేటర్ గజగజ

9 Nov, 2013 04:12 IST|Sakshi

 

=పొల్యూషన్‌తో ఆస్తమా రోగులు విలవిల
 =చలితో పెరుగుతున్న హృద్రోగ సమస్యలు
 =పొడిబారుతున్న చర్మం, పగులుతున్న పెదాలు
 =ఉన్ని దుస్తులు, బాడీ లోషన్లుకు యమ డిమాండ్

 
 సాక్షి, సిటీబ్యూరో : చలితో గ్రేటర్ గజగజ వణుకుతోంది. చీకటిపడిందంటే చాలు సిటీజనులు దుప్పట్లో దూరిపోతున్నారు. పొద్దుపొడిచినా ముసుగు తీయడం లేదు. ఉదయం దట్టమైన మంచు కురుస్తోంది. మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి చలిగాలులు వీస్తున్నాయి. వెరసి ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చల్లని గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఇలా ఒకే రోజు మూడు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శరీరానికి ఈ మార్పులను స్వీకరించే శక్తి లేదు. దీపావళి టపాసులు మిగిల్చిన కాలుష్యంతో ఊపిరాడక అస్తమా రోగులు ఇబ్బంది పడుతుంటే.. తాజా చలి గాలులతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు గజగజ వణికిపోతున్నారు. చలివల్ల కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. జుట్టు రాలుతోంది. హృద్రోగుల్లో సమస్యలు రెట్టింపవుతున్నాయి.

ఈ చలి బారి నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. నగరంలో శుక్రవారం ఉష్ణోగ్రత గరిష్టంగా 28.4 డిగ్రీలు, కనిష్టంగా 19.3 డిగ్రీలు నమోదైంది. గతనాలుగు రోజులుగా ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తోంది. చలి తీవ్రత కారణంగా రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రత మరింత పడేపోయే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.
 
ఊపందుకున్న బాడీ లోషన్లు.. ఉన్ని దుస్తులు విక్రయాలు

పగుళ్ల బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు లిప్ గార్డులు, బాడీలోషన్లు, పాండ్స్ ఇతర క్రీములను ఆశ్రయిస్తుండటంతో ఇటీవల ఆయా ఉత్పత్తులఅమ్మకాలు ఊపందుకున్నాయి. అక్టోబర్ చివరి వరకు రోజుకు ఒకటి రెండు పాండ్స్ క్రీములు అమ్ముడు పోతే శుక్రవారం ఒక్కరోజే 50 డబ్బాలు విక్రయించినట్లు శ్రీనిధి ఫార్మసీ నిర్వహకురాలు జ్యోతిక వివరించారు. రకరకాల బ్రాండ్ల కోసం ప్రజలు ఆయా ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన దుకాణాలను ఆశ్రయిస్తుండగా, మరి కొందరు మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే ఉన్ని దుస్తులు, జర్కిన్‌లు, మంకీ క్యాపులు, మఫ్లర్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు వీటి ధరలను అమాంతం పెంచేశారు. మార్కెట్లో రూ.150 నుంచి రూ.1500 విలువ చేసే జర్కిన్లు లభిస్తున్నాయి.
 
  వృద్ధులూ.. జాగ్రత్త సుమా..    
 
 =వృద్దులు చలినే కాదు ఎండను కూడా తట్టుకోలేరు.
 =ఇంట్లో చిన్న మంట పెట్టి, గదిలో వెచ్చదనాన్ని ఏర్పాటు చేయాలి
 =చన్నీటితో కాకుండా వేడి నీళ్లతో స్నానం చేయించాలి.
 =చలికోటుతో పాటు కాళ్లకు, చేతులకు సాక్స్ దరించాలి.
 =చలికాలంలో రకరకాల వైరస్‌లు వాతావరణంలో సంచరిస్తుంటాయి.
 =వృద్ధులు ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
 =చలికి గుండెపోటుతో పాటు జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది.
 =ఉదయం 8 గంటల తర్వాతే వీరు బయటికి రావాలి.
 - డాక్టర్ నాగేందర్,
 ప్రొఫెసర్, ఉస్మానియా ఆస్పత్రి

 
  పాలబుగ్గలు కందిపోకుండా...

 =సాధ్యమైనంత వరకు పసి పిల్లలను బయట తిప్పరాదు.
 =పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడే అవకాశం ఉంది.
 =నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారి తీసే ప్రమాదం ఉంది.
 =పిల్లలకు సులభంగా జీర్ణం అయ్యే ఆహారం ఇవ్వాలి.
 =బుగ్గలు కందిపోకుండా రాత్రి పడుకునే ముందు పాండ్స్ రాయాలి.
 =కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తువులను ఎంపిక చేసుకోవాలి.
 

మరిన్ని వార్తలు