'బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై సీఎం స్పందించాలి'

20 Oct, 2016 18:07 IST|Sakshi
'బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై సీఎం స్పందించాలి'

హైదరాబాద్: కృష్ణా నదీజలాల వివాదంపై బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు తెలుగు రాష్ట్రాలకు అశనిపాతమని, తెలంగాణకు తీవ్రమైన అన్యాయమన్నారు. ఈ తీర్పుపై ప్రభుత్వ వైఖరి ఏమిటో, భవిష్యత్తులో ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో చర్చించడానికి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ తీర్పును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. తెలంగాణ చేసిన వాదనలో పస లేదా, రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం కలిగించే తీర్పు రావడానికి కారణాలేమిటో ప్రజలకు వెల్లడించాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఒంటికాలుపై లేవడం కాదని, ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి కేసీఆర్ చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసమర్థమైన మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు