అవగాహనలేని కోమటిరెడ్డి బ్రదర్స్‌: పొన్నాల

25 Feb, 2017 03:42 IST|Sakshi
అవగాహనలేని కోమటిరెడ్డి బ్రదర్స్‌: పొన్నాల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా జానారెడ్డి అవుతారని అవగాహన లేకుండా కోమటిరెడ్డి బ్రదర్స్‌ మాట్లాడుతున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. శాసనసభ్యులుగా ఎన్నికైన వారే ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం కాంగ్రెస్‌ విధానమని, ఒకరిద్దరు వ్యక్తుల ఇష్టం కాదని తెలిపారు. కోమటిరెడ్డి విషయం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందన్నారు. కాంగ్రెస్‌ నేతలంతా సమిష్టిగా పోరాడితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపవచ్చుననే భావన సామాన్య ప్రజల్లో ఉందన్నారు. ఏ లక్ష్యాలు, ఆకాంక్షల కోసం తెలంగాణను సాధించుకున్నామో, వాటిని సీఎం కేసీఆర్‌ నీరుగార్చారని విమర్శించారు. ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న ఉద్యమకారులను, హక్కుల కోసం ప్రశ్నించే వారిని తీవ్రవాదులను చూసినట్లు ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు.

ఉద్యమ నేతల ఇళ్లపై దాడులు, అర్ధరాత్రి అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రమంతా కేసీఆర్‌ కుటుంబ జాగీరు అన్నట్టుగా పాలిస్తున్నారని విమర్శించారు. నా రాష్ట్రం, నా ఇష్టం, నన్నెవరూ ప్రశ్నించడానికి వీలులేదు అనే నియంతృత్వ, నిరంకుశ ధోరణితో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని పొన్నాల విమర్శించారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యతిరేక నిర్ణయాలు చేసిన కేసీఆర్‌ను ఇప్పటిదాకా 33 సార్లు కోర్టులు మొట్టికాయలు వేశాయన్నారు. తన భూమికి సంబంధించిన అంశాన్ని పట్టుకుని రాజకీయంగా దెబ్బకొట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారని, ఈ విషయంలోనూ మరోసారి మొట్టికాయ పడకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు